ఆ యాప్‌లో ఛాటింగ్? ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొత్త కోణం

by Sathputhe Rajesh |   ( Updated:2022-09-21 03:26:07.0  )
ఆ యాప్‌లో ఛాటింగ్? ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొత్త కోణం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంపై దర్యాప్తు జరుపుతున్న ఈడీ అధికారులకు ఊహకందని లింకులు దొరుకుతున్నాయి. మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్ళైతో వెన్నమనేని శ్రీనివాసరావుకు సంబంధాలున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీరిద్దరూ సిగ్నల్ మొబైల్ యాప్‌లో చాటింగ్ చేసుకున్నట్లు, సంభాషించుకున్నట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. శ్రీనివాసరావు మొబైల్ ఫోన్‌ను సీజ్ చేసి చాటింగ్ డాటాను రికవరీ చేసినట్లు తెలిసింది. పిళ్లైతో వెన్నమనేనికి ఉన్న వ్యాపార సంబంధాలతో పాటు లిక్కర్ స్కాంలో ఎలాంటి ప్రమేయం ఉన్నదనే అంశాన్ని శోధిస్తున్నారు. ఇప్పటివరకూ హైదరాబాద్‌లో మాత్రమే సోదాలు, డాక్యుమెంట్ల స్వాధీనం, ప్రాథమిక స్థాయిలో ఎంక్వయిరీ జరగ్గా రానున్న రోజుల్లో ఢిల్లీకి రావాల్సిందిగా పలువురికి ఈడీ పిలుపు ఇచ్చే అవకాశం ఉన్నది.

లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఎక్సైజ్ సిబ్బందికి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు భారీ స్థాయిలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నందున ఆ వ్యవహారంతో శ్రీనివాసరావుకు ఉన్న సంబంధంపై ఈడీ ఆరా తీస్తున్నది. ఆయన బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నది. పంజాబ్‌లో డిస్టిల్లరీని ఓపెన్ చేయించడానికి కల్వకుంట్ల కవిత ద్వారా రూ. 4.50 కోట్లు నగదు రూపంలో, క్రెడిట్ నోట్ ద్వారా చేతులు మారినట్లు బీజేపీ ఎంపీలు గతంలో ఆరోపించారు. దీనికి తోడు టెండర్ల విషయంలో రూ. 200 కోట్లకు పైగా హైదరాబాద్ నుంచి లంచాలు ఢిల్లీకి చేరినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. సీబీఐ తొలుత దర్యాప్తు బాధ్యతలు తీసుకున్నా మనీ లాండరింగ్ కోణం నుంచి ఈడీకి బదిలీ కావడంతో ఇప్పుడు హైదరాబాద్‌కు, ఢిల్లీకి మధ్య ఉన్న లింకును, దాని ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను బయటకు లాగే పని మొదలైంది.

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బుక్ అయిన ఫ్లయిట్లు ఒక ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీ ద్వారా జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ఈడీ ఆ సంస్థకు చెందిన రిజిస్టర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నది. ఏ రోజు, ఎవరెవెరి పేరు మీద ఫ్లయిట్ బుక్ అయిందనేది ఇప్పటికే ఈడీ అధికారులకు తెలిసిపోయింది. ఆ ట్రావెల్స్ నిర్వాహకులనూ ఆరా తీశారు. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న ఈడీ 7 గంటల పాటు ప్రశ్నించి ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేసింది. ఆయన స్టేట్ మెంట్ ఆధారంగా మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. శ్రీనివాసరావు మొబైల్ ఫోన్ డాటాను విశ్లేషించిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈడీకి సైతం తదుపరి దర్యాప్తుకు ఆధారాలు లభించే అవకాశం ఉంది. రెండు వారాల వ్యవధిలో ఈడీ మూడుసార్లు సోదాలు చేయడం, మరో రెండు సందర్భాల్లో ఎంక్వయిరీ చేసినందున మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సి వస్తే ఢిల్లీకి పిలిపించుకునే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన కోట్లాది రూపాయల నగదు ఏ అవసరం కోసం ఉద్దేశించినవి? హైదరాబాద్ లోని వ్యాపారవేత్తలకు ఉన్న లింకు ఏంటి? ఎవరి ఖాతా నుంచి ఇంకెవరి ఖాతాల్లోకి ఎంతెంత మొత్తంలో బదిలీ అయింది? ఢిల్లీ మద్యం దుకాణాల టెండర్ల కోసమేనా? హైదరాబాద్‌కు చెందిన 9 కంపెనీలకు అక్కడ దుకాణాలకు అవకాశం లభించడం వెనక ఏమైనా సంబంధం ఉన్నదా? అనే అంశాలపై ఈడీ దృష్టి సారించింది.

Also Read : లిక్కర్ స్కాంలో రోజుకో ట్విస్ట్.. వెలుగులోకి ఎంపీ సంతోష్ రావు లింకులు?

Advertisement

Next Story