ప్రజాపాలనలో కొలువుల జాతర : సీఎం రేవంత్​రెడ్డి

by M.Rajitha |
ప్రజాపాలనలో కొలువుల జాతర : సీఎం రేవంత్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘‘నేను మొదటిసారి ఇండిపెండెంట్​జెడ్​పీటీసీగా గెలిచినప్పుడు.. ఈనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టినదానికంటే కూడా ఎక్కువ ఆనందం కలిగింది”అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. రవీంద్రభారతీలో గురువారం ప్రజాపాలనలో కొలువు జాతర పండుగను నిర్వహించారు. దీనికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యుయాదయ్య, ఇర్లపల్లి శంకర్​, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, చీఫ్​సెక్రటరీ శాంతికుమారి, ఎంఏఐయూడీ ప్రిన్సిపల్​ సెక్రటరీ దానకిషోర్, పంచాయతీరాజ్​ఉన్నతాధికారులు విచ్చేయగా ముఖ్య​అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ప్రసంగిస్తూ..‘‘ప్రజా జీవితంలో ప్రజలకు సేవ అందించాలనుకొని చాలామంది కలలు కంటుంటారు.. కానీ కొద్ది మందికే అవకాశం వస్తుంది. కొంతమంది జీవిత కాలం అవకాశాలు రాకుండా ప్రజా జీవితంలోనే సర్వం కోల్పోయిన వాళ్లున్నారు.

మొదటిసారి ఏ అవకాశం వస్తాదో.. అది చిన్నదా..పెద్దదాఅనేకంటే మనకు వచ్చిన అవకాశం జీవితం కాలం గుర్తుండిపోతది..ఏవరికైనా మొట్టమొదటిసారి ఉద్యోగం రావడం..ఒక బాధ్యతను చేపట్టడం అనేది అనిర్వచనీయ సందర్భం”అని ముఖ్యమంత్రి కొత్తగా ప్రభుత్వంలోకి వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.‘‘దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న మీ కల ఇవాళ నిజం కాబోతుందని, ఇవాళ నియామక పత్రాలు అందుకోబోతున్న 922 మందికి, వారి కుటుంబ సభ్యులకు సీఎం అభినందనలు తెలిపారు. అలాగే, ఈరోజు మీ అందరికీ కూడా మొట్టమొదటిసారి జీవితంలో ఈ ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే అవకాశం వచ్చింది.. మీకందిరికీ ఒక మరపురాని తీపి జ్ఞాపకం ఉంటుదని నేను భావిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. ‘‘మీ తల్లిదండ్రులు బతికున్నంత వరకు, మీ కుటుంబ సభ్యులు ఈ ప్రజలకు సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగం లోనే వారు అకాల మరణంతో వారి వారసత్వంగా వారందించిన సేవలకు గుర్తింపుగా ఈ కారుణ్య నియమకాలు చేపట్టడం జరుగుతుంది.

అందులో భాగంగానే పంచాయతీరాజ్, మున్సిపల్​శాలకు చెందిన 922 మందికి నియమకాలు అందిస్తున్నాం. ఈ నియామకాలు మీ హక్కు..”అని సీఎం స్పష్టం చేశారు. అయితే, మీ కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా మీకు రావాల్సిన ఉద్యోగాలు ఇవి.. గత పాలకులు పదేళ్లుగా ఈ నియామకాలను పట్టించుకోలేదు..దానివల్ల అత్యంత విలువైన సమమం కాలగర్భంలో కలిసిపోయింది. ఎంత నిర్లక్ష్యం వహించిందో ఆలోచించండి.. అలాంటి నిర్లక్ష్యం, అవలక్షణాలు ప్రజా ప్రభుత్వంలో ఉండకూడదు..దరిదాపుల్లోకి రాకుడదనే ఈ నియామకాలు పూర్తి చేస్తున్నాం . ఈ నియమకాలను క్రమం తప్పకుండా ప్రభుత్వం చేపట్టాల్సిన బాధ్యత” అని సీఎం ఈసందర్భంగా పేర్కొన్నారు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జీవితాలు బాగుపడతాయని నిరుద్యోగ యువత పోరాడిందని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ కోసం అమరులైనవారి ఆశయాలు నెరవేరలేదన్నారు. మేం అధికారంలో రాగానే 57, 924 ప్రభుత్వ ఉద్యోగాలను ప్రజా ప్రభుత్వంలో భర్తీ చేశామని తెలిపారు. ‘‘కానీ తామే నోటిఫికేషన్లు వేశామని, మేం చేసింది ఏం లేదని కొందరు మాట్లాడుతున్నారు అని, పదేళ్లు పరీక్షలు నిర్వహించకపోతే నిరుద్యోగుల జీవితాలు ఆగమైన పరిస్థితి మీకు కనిపించలేదా?.. 10 నెలల్లో మేము చేసిన పనులను 10 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.. కేసీఆర్ కుటుంబ సభ్యులను ప్రజలు తిరస్కరిస్తే..ఒకరి ఎమ్మెల్సీ, మరొకరికి ప్లానింగ్​కమిషన్​వైస్​చైర్మన్​పదవి ఇచ్చుకున్న మీకు… తెలంగాణలో ఈ పేదింటి బిడ్డల బాధ కనిపించలేదా?,, పేదింటి బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన ఎందుకు చేయలేదు? పదది నెలల్లో మేం చేసిన పని… పదేళ్లలో మీరెందుకు చేయలేకపోయారు?..’ అని సీఎం గత పాలకులను ప్రశ్నించారు.

నెల రోజుల్లో గ్రూప్ 1, 2, 3 నియమకాలు..

కేవలం పది నెలల్లో 57, 924 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదని, గ్రూప్ 1, 2, 3 లలో 2వేల పైచిలుకు ఉద్యోగాలకు మరి కొన్ని రోజుల్లో నియామక పత్రాలు అందించబోతున్నామని సీఎం తెలిపారు. తాము చేయలేదు కాబట్టి మమ్మల్ని చేయనీయకూడదనే ధోరణిలో బీఆరెస్ తీరు అని సీఎం దుయ్యబట్టారు. స్వరాష్ట్రం వచ్చినా నిరుద్యోగుల కల నెరవేరలేదని, ప్రతిపక్షాలు ఉద్యోగ నియామకాలు ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వాటన్ని ఆధిగమించి పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగనివ్వకూడదని నిర్ణయించి, వెంటవెంటనే నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు ఇస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో ఏ బాధ్యతలు విస్మరించిందో? వాటిని తాము నెరవేరస్తున్నామని చెప్పారు. నిరుద్యోగుల బాధలను ప్రభుత్వం గుర్తించి, ఏడాదిలోనే 59వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. అందుకే మా కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆనాడు ఒక వ్యక్తి, ఒక పార్టీ సెంట్రిక్ గా నిర్ణయాలు జరిగితే.. ఇవాళ ప్రజాభీష్టం మేరకు నిర్ణయాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.

అక్రమాలు అడ్డుకట్టకు బిల్డ్ నౌ పోర్టల్..

హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు అరికట్టేందుకే బిల్డ్ నౌ పోర్టల్ ను తీసుకొచ్చామని తెలిపారు. ఎంతటివారైనా సరే ఆన్లైన్ లో అనుమతులు తీసుకోవాల్సిందే అని అన్నారు. ప్రజలకు పారదర్శక పరిపాలన అందించడమే మా ఉద్దేశం.. అదే గుడ్ గవర్నెన్స్.. ఇది తెలంగాణ మోడల్ అని పేర్కొన్నారు. ‘‘ప్రజలు మాపై కోపంగా ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు.. నిరుద్యోగులకు ఉద్యోగ నియామకపత్రాలు అందిస్తున్నందుకు నాపై కోపంగా ఉన్నారా?.. అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు సోలార్ ఉత్పత్తి చేసే అవకాశం కల్పించినందుకు నాపై కోపం ఉంటుందా?.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినందుకా?.. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకా?.. ఎందుకు మాపై కోపంగా ఉంటారు? అని సీఎం వ్యాఖ్యానించారు.

విజ్ఞత లేకే.. ఫామ్ హౌస్​లో..

‘‘రేవంత్ రెడ్డికి పట్టు రాలేదని మాట్లాడుతున్నారు.. రాజయ్య, ఈటెల లాంటి బలహీనవర్గాలను సస్పెండ్ చేస్తేనే పట్టు వచ్చినట్టా.. మేం గడీలలో పెరగకపోవచ్చు… కానీ నల్లమల అడవుల్లో పేదలను చూస్తూ పెరిగాం.. రాజకీయ నాయకులు మాత్రమే మారారని, అధికారులు మాత్రం వారేనని.. తాను ఒక్కసారి ఆర్డర్స్ ఇస్తే.. వారందరినీ లోపల వేస్తారని, కాని తాను కేసీఆర్ మాదిరి నియంత పనులు చేయలేనని. తనకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసని, గత పాలకులకు లేని విజ్ఞత తమకు ఉందని అన్నారు. సెక్రటెరియట్​రాని కేసీఆర్ కు పాలనపై పట్టు ఉంటుందా? రోజుకు 18 గంటలు పనిచేసే తనకు, తన మంత్రులకు పట్టు ఉంటుందా’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. కేసీఆర్​పాలనలో సచివాలయంలోకి అడుగు కూడా పెట్టనిచ్చేవారు కాదని...ఇప్పుడే సెక్రటెరియట్​వచ్చి ధర్నాలు చేస్తున్నారని.. నేను అనుమతి ఇవ్వకపోతే సామాన్యులు వచ్చేవారా అని అన్నారు. ‘‘ ముఖ్యమంత్రికి విజ్ఞత ఉండాలి.. మేం విజ్ఞతను ప్రదర్శిస్తున్నాం.. ఆ విజ్ఞత లేకపోవడం వల్లే ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేకపోతున్నారు..”అని సీఎం కేసీఆర్​ను ఉద్దేశించి ప్రసంగించారు.

అందాల పోటీలతో ప్రపంచ చూపు..

మిస్ యూనివర్స్ పోటీలపై కూడా కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. పర్యాటక రంగానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని సీఎం అన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారని, 72 వ మిస్ యూనివర్స్ పోటీలతో ప్రపంచం తెలంగాణ వైపు చూడబోతుందని. భవిష్యత్ లో వందల కోట్ల ఆదాయం రాబోతుందని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు.

‘‘ఫార్ములా ఈ రేస్ ముసుగులో ప్రభుత్వ ధనాన్ని సొమ్ము దోచుకున్నారు.. మీకు మాకు పోలికా?.. పట్టింపులేకుండా వ్యవహరించిన విధానం మీది.. పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం మాది’’ అని సీఎం అన్నారు. కేసీఆర్​మందు పాలసీ తీసుకువస్తే.. మేం హైదరాబాద్​లో రైతు బజారులలోకి ఇసుక బజార్లను తీసుకువచ్చామన్నారు. గతంలో ఇసుక అక్రమ మాఫియాను అడ్డుకొని రోజుకు 3కోట్ల వరకు ఆదాయాన్ని పెంచామని తెలిపారు. ఇసుక కావాలి అనుకున్నవారికి నేరుగా డోర్​డెలివరీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈసందర్భంగా సీఎం ప్రకటించారు.

పదేండ్ల నిరీక్షణకు తెర : మంత్రి సీతక్క..

పదేండ్లుగా నిరీక్షిస్తున్న కారుణ్య నియామక ఉద్యోగుల కల ఈరోజు నెరవేరిందని, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పదేండ్ల నిరీక్షణకు తెర దించారని ఆమె పేర్కొన్ఆనరు. యువత కు కొలువులు ఇవ్వడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం అన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు కారుణ్య నియామకాలను చేపట్టడం జరిగిందన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో వివిధ హోదాల్లో హోదాల్లో పనిచేసి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది యువకులు అమరులయ్యారని, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాల కోసం ఎంత మందో ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు.

గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో కేవలం 81 వేల ఉద్యోగాలనే భర్తీ చేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీపై గత ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేసే ఉంటే ఎంతోమంది ప్రాణాలు దక్కేవి అని ఆవేదన వ్యక్తం చేవారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నియామకాలపై దృష్టి సారించారని చెప్పారు. 2018 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, పేపర్ లీకేజీ లతోనే కాలం వెళ్లదీశారని సీతక్క విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారని, ఉద్యోగ నియామకాలను ఒక యజ్ఞం గా పూర్తి చేస్తున్నారని ఈసందర్భంగా సీతక్క స్పష్టం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఎంపికైన వారికి ఉద్యోగ నియమక పత్రాలు అందజేశారు.

Next Story

Most Viewed