- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అకాల వర్షాలకు పంట నష్ట పోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించాలి : హరీష్ రావు

దిశ, సిద్దిపేట ప్రతినిధి : అకాల వర్షాలకు పంట నష్ట పోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద హితోధికంగా ఆర్థిక సాయం చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రైతులను దగా చేసిందని, వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన ఒక్క హామీ అమలుకు నోచుకోలేదన్నారు. అన్నదాతలకు రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తే కాంగ్రెస్ నాయకులు స్పందించిన పాపాన పోలేదన్నారు. దేశంలో మొదటి సారిగా మాజీ సీఎం కేసీఆర్ ఎకరానికి రూ.10 వేల చొప్పున 11 విడతల్లో రూ.73 వేల కోట్లు రైతు బంధు కింద రైతులకు సాయం చేసినట్లు గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎకరానికి రూ.7500 వేలు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి..వానకాలం పంటకు రైతుల ఖాతాల్లో జమ చేయలేదన్నారు. యాసంగి పంటకు ఎకరాకు రూ. 6 వేలు ఇస్తామని చెప్పి మూడు ఎకరాలు దాటలేదన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ.15వేల చొప్పున యాసంగి, వానకాలం రైతు భరోసా డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు బోనస్ అనేది బోగస్ అయిపోయిందన్నారు. పంటల బీమా పేరిట రూ.13 వందల కోట్లు బడ్జెట్ లో పెట్టామని చెప్పారు.. మూడు సీజన్లుగా బీమా రాలేదన్నారు. ఈ విషయం అసెంబ్లీలో ప్రస్తావిస్తే తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు సిద్దిపేట రూరల్ మండలం ఇంద్ర గూడెం రాఘవాపూర్ గ్రామంలో జరిగిన బీరప్ప ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.