జీపీవో కాదు.. జేఆర్ఐ పెట్టండి : ట్రెసా, వీఆర్వో జేఏసీ డిమాండ్

by M.Rajitha |
జీపీవో కాదు.. జేఆర్ఐ పెట్టండి : ట్రెసా, వీఆర్వో జేఏసీ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రెవెన్యూ శాఖలో అపారమైన అనుభవం, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం ఉన్న వీఆర్వోలను ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండానే యథావిధిగా తీసుకురావాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ స్థాయిలో పనిచేసే గ్రామ అధికారుల హోదానే జీపీవోకు బదులుగా జూనియర్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గా నామకరణం చేయాలన్నారు. మంగళవారం సీసీఎల్ఏలోని ట్రెసా కార్యాలయంలో తెలంగాణ వీఆర్వో జేఏసీ సమమావేశం చైర్మన్ గోల్కొండ సతీష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీపీవో అంటే ఈ పోస్టు రెవెన్యూ శాఖకు సంబంధం లేనట్లుగా కనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,954 గ్రామ స్థాయి అధికారులను నియమించడానికి ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్రెసా ప్రధాన కార్యదర్శి కే గౌతమ్ కుమార్ మాట్లాడుతూ.. అత్యంత విలువ గల వీఆర్వో పోస్టును గత ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్ర ప్రజానీకానికి ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఈ వ్యవస్థ లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ట్రెసా, వీఆర్వో జేఏసీ విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ వ్యవస్థ తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. వీఆర్వో జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ మాట్లాడుతూ.. రద్దయిన వీఆర్వోల ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా 10,954 గ్రామ స్థాయి అధికారులను నియమించడానికి నిర్ణయం తీసుకున్న సీఎం, మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వీఆర్వోలకు అనేక రకాల విధులు నిర్వర్తించిన అనుభవం ఉందన్నారు. అన్ని విధాలా ధృవపత్రాల జారీ, ప్రోటోకాల్, ఎలక్షన్ డ్యూటీ, ఇసుక మాఫియాలను అరికట్టడం, భూ కబ్జాదారులపై చర్యల విషయంలో పాల్గొన్నారన్నారు.

సమయపాలన లేకుండా రోజుకు 16 నుంచి 18 గంటలు ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పని చేసే ఓపిక వీఆర్వోలకు కుందన్నారు. తమను ఎలాంటి షరతులు లేకుండా, యథావిధిగా రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని కోరారు. అర్హులైన వీఆర్వోలకు ప్రమోషన్లు కల్పించాలని, కామన్ సీనియార్టితో సర్వీసును ఫిక్స్ చేయాలన్నారు. కార్యక్రమంలో వీఆర్వో జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్, సెక్రటరీ జనరల్ హరాలే సుధాకర్ రావు, అదనపు సెక్రటరీ జనరల్ పల్లెపాటి నరేష్, వైస్ చైర్మన్లు చింతల మురళి, ప్రతిభ, సర్వేశ్వర్, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు.

Next Story