కొండగట్టులో చోరీకి పక్కా స్కెచ్! అందుకే ఆ మార్గం గుండా..

by Sathputhe Rajesh |
కొండగట్టులో చోరీకి పక్కా స్కెచ్! అందుకే ఆ మార్గం గుండా..
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : గురువారం అర్థరాత్రి కొండగట్టు అంజన్న సన్నిధిలో ఏం జరిగింది..? అగంతకులు అక్కడకు ఎప్పుడు చేరుకున్నారు..? భక్తుల రూపంలో వచ్చిన దొంగలు ఆలయ పరిసరాలను పరిశీలించి ఓ అంచనాకు వచ్చారా..? ఔట్ పోస్టులో ఉంటే పోలీసులు అర్థరాత్రి రెస్ట్ రూంకు వెళ్తారన్న విషయం ముందుగానే పసిగట్టారా..? ఆ కారణంగానే తెల్లవారు జామున ఒంటిగంట వరకు వేచి చూసి డ్యూటీ పోలీసులు రెస్ట్ కోసం వెళ్లగానే తమ పని కానిచ్చేశారా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

అర్ధరాత్రి వరకూ...

కొండగట్టు ఆలయంలో దొంగతనానికి వచ్చిన దుండగులు ముందుగా వేసుకున్న స్కెచ్‌ను పక్కాగా అమలు చేసినట్లుగా స్పష్టమవుతోంది. భక్తుల రూపంలో ఆలయ పరిసరాల్లో తిరిగి రెక్కీ నిర్వహించి తెల్లవారు జామున అమలు చేసినట్టుగా అర్థమవుంతోంది. ఆలయ ఆవరణలో తరతరాలుగా ఓ ఆనవాయితీ వస్తోంది. మానసిక రుగ్మతలు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారు కొండగట్టుపై కొంతకాలం ఆవాసం ఉన్నట్టయితే తమ ఆరోగ్యంగా ఉంటామన్న నమ్మకం భక్తుల్లో ఎక్కువగా ఉంటుంది.

గతంలో అయితే మానసిక రుగ్మతలకు గురైన వారిని వారి కుటుంబ సభ్యులు కట్టేసి మరీ అక్కడ వదిలేసి వెళ్లిపోయేవారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులు అధికారులు కూడా హెచ్చరికలు చేయడంతో మానసిక వికలాంగులను ఇక్కడకు పంపించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే అనారోగ్యంతో ఉన్న వారే కాకుండా సాధారణ భక్తులు కూడా కొండగట్టుపై నిద్రించే ఆనవాయితీ మాత్రం నేటికీ కొనసాగుతోంది. దీంతో రోజూ రాత్రి వేళల్లో భక్తులు ఆలయ ప్రాంగణంలో సంచరించడం సాధారణంగా మారిపోయింది. ఈ విషయాన్ని పసిగట్టిన అగంతకులు భక్తులుగా స్వామివారి సన్నిధి అంతా కలియతిరిగినట్టు భావిస్తున్నారు.

గురువారం అర్థరాత్రి ఔట్ పోస్టు సమీపంలోనే ఉన్న వీరు డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది రెస్ట్ రూంకు వెల్లిపోయిన తరువాత తమ పనిని కానిచ్చేసినట్టుగా స్పష్టం అవుతోంది. అలాగే గుడి వద్ద రక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నియమించుకున్న సెక్యూరిటీ సిబ్బంది నైట్ షిఫ్ట్ విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని కూడా పసిగట్టినట్టుగా భావిస్తున్నారు.

కేవలం పగటిపూట భక్తులు వచ్చిపోయే సమయంలో సెక్యూరిటీ విధులు నిర్వర్తించి రాత్రి వేళల్లో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని గమనించిన దొంగలు దోపిడీ చేసేందుకు ఆ సమయాన్ని ఎంచుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. అయితే సెక్యూరిటీ ఏజెన్సీ కూడా గార్డులు విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అన్న విషయాన్ని పర్యవేక్షించేందుకు ఓ సూపర్ వైజర్ ను నియమించాల్సి ఉంటుందని... ఈ సూపర్ వైజింగ్ చేసే విధానానికే సంస్థ స్వస్తి పలికిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

అటు వైపు నుంచే ఎందుకో...?

చోరీ చేసేందుకు అగంతకులు ఆలయ పశ్చిమ ద్వారాన్ని ఎందుకు ఎంచుకున్నారన్న విషయంపై కూడా ఓ క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆలయ ప్రధాన ద్వారం నుంచి గుడి లోపలికి వెళ్లాలంటే తూర్పు వైపున ఉన్న ద్వారం భారీ సైజులో ఉండడంతో పాటు దాని తాళాలు తొలగించి తీసినట్టయితే రాజగోపురం ముందు ఉన్న ఖాలీ స్థలంలో పడుకునే భక్తులు నిద్ర నుంచి మేలుకునే అవకాశం ఉందని భావించినట్టుగా అనుమానిస్తున్నారు.

అలాగే ఉత్తర, దక్షిణ ద్వారాల వైపున నిర్మించిన షెడ్లలో కూడా భక్తులు సెదతీరుతుంటారన్న విషయాన్ని గమనించి అర్థరాత్రి వేళల్లో ఏ చిన్న అలజడి వినిపించినా దొరికిపోతామని గమనించే పశ్చిమ ద్వారాన్ని ఎంచుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ ద్వారం వద్ద రాత్రి సమయంలో భక్తుల సంచారం ఎక్కువగా ఉండకపోవడం మరోవైపు ద్వారం పక్కనే స్వామివారికి నైవేద్యం తయారు చేసే గదితో పాటు ఆలయ పూజారుల విశ్రాంతి గదులు ఉండడం చేత రాత్రి సమయంలో భక్తులు అటువైపుగా ఎవరు రారని ముందుగానే గమనించి వెనుక ద్వారాన్ని సెలెక్ట్ చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఆలయంలోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డారని అంచనా వేస్తున్నారు.

పశ్చిమ ద్వారం వైపు వెళ్లాలంటే వెనక భాగంలో భేతాళేశ్వరుని ఆలయం గుట్టలు, అడవులు విస్తరించి ఉండడంతో రాత్రి వేళల్లో భక్తులు ఎవరూ కూడా పశ్చిమ ద్వారం వైపు వెళ్లేందుకు సాహసించరు. దీంతో నిర్మానుష్యంగా ఉండే ద్వారం గుండా గర్భాలయం వద్దకు వెళ్తే తమ టార్గెట్ చేరుకుంటామని అగంతకులు స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. అనుకున్న ప్రకారం పక్కాగా వేసుకున్న ప్లాన్ అమలు చేసిన దొంగల ముఠా భారీ ఎత్తున్న అంజన్న సొత్తును ఎత్తుకెళ్లింది.

Advertisement

Next Story