గాంధీభవన్ ముఖాముఖి ప్రోగ్రామ్ కు 328 అప్లికేషన్లు

by Mahesh |
గాంధీభవన్ ముఖాముఖి ప్రోగ్రామ్ కు 328 అప్లికేషన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీభవన్ (Gandhi Bhavan)లోని మంత్రుల ముఖాముఖీకి 328 అప్లికేషన్లు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమస్యలన్నింటినీ స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించి, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. సమస్యలపై ఫోకస్ పెట్టి వెంటనే పరిష్కరించాలని సూచించారు. తన తదుపరి ముఖాముఖీ కార్యక్రమం షెడ్యూల్ లోపు పరిష్కరించబడాలని ఆదేశించారు. జీవో నెంబర్ 46 తో ఇబ్బందులు పడుతున్న పోలీస్ అభ్యర్థులతో మాట్లాడి మంత్రి సమస్య తెలుసుకున్నారు. సీఎస్ తో మాట్లాడి ఈ నెల 26న అపాయింట్ మెంట్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. సమస్యను ఆమె దగ్గర క్షుణ్ణంగా వివరించేందుకు ప్రిపేర్ కావాలని కోరారు. ఇక వికలాంగులు, వీఆర్ ఏ, డీఎస్సీ, తదితర సమస్యల బాధితులు మంత్రికి రిక్వెస్ట్ అందజేశారు.

జగిత్యాల మర్డర్ దురదృష్టకరం: మంత్రి శ్రీధర్ బాబు

జగిత్యాల మర్డర్ దురదృష్టకరమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ...హత్యను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు,సీనియర్ కాంగ్రెస్ నేత కావడంతో జీవన్ రెడ్డి బాధలో ఉన్నారని వెల్లడించారు. ఆ కుటుంబానికి అండగా ఉండాలని పీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్ , సీఎం రేవంత్ రెడ్డి తనకు చెప్పారని వివరించారు. పార్టీ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎంక్వయిరీ జరపాలని డీజీ, జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చామన్నారు. పార్టీ వైపు నుంచి తనను ఫాలప్ చేయాలని పీసీసీ అధ్యక్షుడు తనకు చెప్పారని వెల్లడించారు. జీవన్ రెడ్డి తో స్వయంగా మాట్లాడానని, జగిత్యాల మర్డర్ వెనుక ఎవరు ఉన్నా, వదిలిపెట్టేది లేదని హామీ ఇచ్చానన్నారు.

చైర్మన్ వర్సెస్ సీపీఆర్వో...

గాంధీభవన్ లో బుధవారం మంత్రి ముఖాముఖి ప్రోగ్రామ్ కంటే కొద్ది నిమిషాల ముందు కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, పార్టీ సీపీఆర్వో హరిప్రసాద్ ల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. గాంధీభవన్ లో హాడావిడి చేస్తున్న జీవో 46 అభ్యర్థుల అంశం వీరిద్దరి వాగ్వాదానికి కారణమైందని ప్రత్యక్షులు తెలిపారు. ఈ అంశం పార్టీ పెద్దల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఈ లొల్లికి కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యాదృచ్ఛికంగా జరిగిందా? ఇతర కారణాలు ఏమైన ఉన్నాయా? అని పార్టీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed