ట్రాఫిక్ రూల్స్ అవగాహన కోసం 30 వేల మంది..

by Rajesh |
ట్రాఫిక్ రూల్స్ అవగాహన కోసం 30 వేల మంది..
X

దిశ, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు పోలీసు లకు మద్దతుగా రానున్న రోజుల్లో 30 వేల మంది యువత రోడ్లపై నిలబడనున్నారు. వీరు వాహనదారులకు, ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన అవశ్యకత , వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించకపోతే కలిగే అనర్థాలు వంటి అంశాలను వివరించనున్నారు. దీని కోసం విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా ఎన్ఎస్ఎస్(నేషనల్ సర్వీస్ స్కీం)లో రిజిస్టర్ అయిన యువతి, యువకుల సేవలను వినియోగించనున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ పోలీసులు 500 మంది విద్యార్ధులకు ట్రాఫిక్ అంశాలపై శిక్షణను ఇచ్చారు. ఇలా ఈ శిక్షణను పొందిన విద్యార్ధులు నెలకు ఒక గంట పాటు పోలీసులు కేటాయించే స్పాట్‌లలో నిలబడి గంటపాటు ట్రాఫిక్ అంశాలపై వాహనదారులకు, ప్రజలకు అవగాహనను కల్పించనున్నారు. మొదటి ఫేజ్‌లో భాగంగా 30 వేల ఎన్ఎస్ఎస్ విద్యార్ధుల సేవలను పోలీసులు వినియోగించుకోనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ రవిగుప్తా విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి వారికి డ్రెస్ కోడ్ దుస్తులను అందించారు. ఇలా ఈ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలను మహిళల రక్షణ కోసం, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణను చేయడానికి ఉపయోగించుకుంటామని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు తెలిపారు.

నషా ముక్త్ తెలంగాణగా తీర్చి దిద్దుతాం- రవిగుప్తా, డీజీపీ

డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా మార్చేందుకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలను తప్పక ఉపయోగించుకుంటాం. వీరి ద్వారా ప్రతి స్కూల్, పాఠశాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాం. హైదరాబాద్ లో కావాల్సిన రోడ్లు, లేన్ లు ఉన్నాయి. కాని వాటిన ఎవరు సరైన మార్గంలో ఉపయోగించుకోవడం లేదు. అందుకే ట్రాఫిక్ సమస్యలు ఉత్పనమవుతున్నాయి.

పీపుల్ ఫ్రెండ్లీ సిటీగా మారుస్తాం- బుర్ర వెంకటేశం, ప్రిన్సిపల్ సెక్ట్రటరీ, విద్యాశాఖ

హైదరాబాద్ సిటీని పీపుల్స్ ఫ్రెండ్లీగా మారుస్తాం. దీని కోసమే ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ద్వారా వాహనదారుల్లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహ పెంచి వారికి సురక్షితమైన , సాఫీ ప్రయాణాన్ని అందిస్తాం. ఇప్పుడు 20 వేల మంది యువతులు, 10 వేల మంది యువకులతో నగరంలో ట్రాఫిక్ రూల్స్ పై విస్త్రుత ప్రచారం చేస్తాం. ఇలా మహిళలను ఇబ్బంది పెట్టే స్పై కెమెరాల బెడదను నివారించేందుకు కూడా అన్ని షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సముదాయాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తాం. అదే విధ:గా డ్రగ్స్ పై కూడా అవగాహన, ప్రచారాన్ని నిర్వహించి డ్రగ్స్ మహమ్మారిని తరిమివేస్తాం. 30 వేల మందితో ప్రారంభమయ్యే ఈ సేవలు త్వరలో మూడున్నర లక్షల మంది యువతతో అవగాహన కార్యాక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలను రూపొందించాం.

ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి- కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సీపీ

హైరదాబాద్ విశ్వనగరంగా ప్రచారం జరిగింది. కాని దానికి కావాల్సిన అర్హతను పొందేందుకు ప్రతి పౌరుడి బాధ్యత. ఈ నేపధ్యంలో ప్రతి ఒకరు ట్రాఫిక్ రూల్స్ పాటించి ఓ క్రమశిక్షణతో రోడ్ల పై వాహనాలను నడిపి విశ్వనగరంగా గుర్తింపు పొందాలి.వాణిజ్య భవనాల నిర్వాహకులు, ఇతర వాణిజ్య వ్యాపారాలు చేసే యజమానులు పాదచారులకు, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా వారు పార్కింగ్ ఏర్పాట్లను చేసుకోవాలి.ఇప్పుడు ఆటోమేటడ్ పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకునే సాంకేతిక పరిజ్ణాణం అందుబాటులోకి వచ్చింది. విస్తారమైన రోడ్లు అందుబాటులో ఉన్నాయి, కాని ఎవరు క్రమశిక్షణతో వాహనాలను నడపడం లేదు. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి చట్ట బద్ధంగా ట్రాఫిక్ రూల్స్ అమలును నిర్లక్ష్యం చేస్తున్నారు.

Advertisement

Next Story