Uttam Kumar Reddy: ఎస్సీ వర్గీకరణపై నేడే కీలక మీటింగ్

by karthikeya |   ( Updated:2024-09-16 05:10:10.0  )
Uttam Kumar Reddy: ఎస్సీ వర్గీకరణపై నేడే కీలక మీటింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై ఈ రోజు (సోమవారం) నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అధ్యక్షతన రెండు కేబినెట్ స్థాయి సబ్‌ కమిటీ మీటింగ్ జరగన్నాయి. ఈ భేటీలు జలసౌధలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా మధ్యాహ్నం 2 గంటలకు ఉత్తమ్ కుమార్ చైర్మన్‌గా రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ కోసం గతంలో ఎమ్మెల్యేలకు, రాజకీయ పార్టీలకు సబ్ కమిటీ రాసిన లేఖలతో పాటు వచ్చిన సిఫారసులు, విధి విధానాలపై చర్చించనున్నారు.

ఈ సమావేశంలో మంత్రులు దామోదర్ రాజా నర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు, వర్గీకరణ అమలుకు సంబంధించిన అంశాలపై మంత్రి ఉత్తమ్ చైర్మన్‌గా చర్చ జరగనుంది. ఈ మీటింగ్‌లో కో చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి పాల్గొనబోతున్నారు.

ఇదిలా ఉంటే రెండో మీటింగ్‌ నిర్వహించే ముందు 3.45 గంటలకు సచివాలయ ప్రాంతంలో దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) విగ్రహావిష్కరణ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విగ్రహావిష్కరణ చేయనున్నారు. కార్యక్రమానికి మంత్రులంతా హాజరు కానున్నారు.

Advertisement

Next Story