తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రాలు రెడీ టు ఓపెన్

by Shyam |
తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రాలు రెడీ టు ఓపెన్
X

దిశ, కరీంనగర్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో కేవలం నిత్య కైంకర్యాలకే పరిమితమైన ఆలయాల్లోకి భక్తులను అనుమతించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దేవాలయాలు లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా సిద్ధమవుతున్నాయి.రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యత కల్గిన ఆలయాలు ఎక్కువగా ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాయి. దీంతో ఆయా ఆలయాల అధికార యంత్రాంగం భక్తుల సౌలభ్యం కోసం ఏర్పాట్లు చేపట్టింది. అయితే ఆలయాల్లో తీర్థ ప్రసాదాలు, శఠారీ ఇవ్వకూడదని ప్రభుత్వం ఆదేశించింది. కేవలం భక్తుల కోసం లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతారు. అలాగే అన్ని దేవాలయాల్లో మాత్రం భక్తులు బస చేసే అవకాశం మాత్రం లేదు. ఆలయ సత్రాలను అద్దెకు ఇవ్వడం లేదు.

వేములవాడ..

సిరిసిల్ల జిల్లాలో ఉన్న వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 8 నుంచి సాధారణ భక్తులు ఆలయంలోకి అనుమతించనున్న నేపథ్యంలో కోడె మొక్కులు తీర్చుకునే చోట ఏర్పాటు చేసిన బారిగేట్ల మీదుగా భక్తులు ఆలయంలోకి రాజన్నను దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా శానిటైజ్ చేయడంతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ బాక్సులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ఈఓ కృష్ణ వేణి సెలవులో ఉండడంతో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు డిప్యూటీ కమిషనర్ రామకృష్ణకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.

కాళేశ్వరంలో…

భూపాలపల్లి జిల్లాలోని త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరంలో ఆలయ అధికారులు క్యూ లెన్లలో భక్తులు వెళ్లేందుకు మూడు ఫీట్ల దూరంలో సామాజిక దూరంతో ప్రత్యేకంగా బాక్సులు వేస్తున్నారు. ఈ ఆలయం రాష్ట్ర సరిహద్దుల్లో ఉండటంతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇక్కడే ఉంది. దీంతో ఇటీవల కాలంలో ఈ ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దీనిని ధృుష్టిలో పెట్టుకుని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆలయ ఈఓ మారుతి తెలిపారు. అలాగే క్షేత్రంలో బస చేసేందుకు అనుమతి లేనందున తాము ఆలయ గదులను అద్దెకు ఇవ్వడం లేదని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు స్వామి వారిని దర్శించుకుని తిరిగి తమ గమ్య స్థానాలకు సాయంత్రం వరకు చేరుకునే విధంగా ప్లాన్ చేసుకుని రావాలని సూచించారు.

జగిత్యాల జిల్లా ధర్మపురిలో…

జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసే పనిలో దేవాదాయ అధికారులు నిమగ్నం అయ్యారు. ఇక్కడ శానిటైజ్ చేయడంతో పాటు భక్తులు లాక్‌డౌన్ రూల్స్ ప్రకారం నడుచుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కొండగట్టు అంజన్న క్షేత్రంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.అయితే గర్భాలయాల్లోకి మాత్రం భక్తులను అనుమతించేది లేదని ఆలయ అధికారులు చెప్తున్నారు. మాస్క్ ఉన్నవారిని అనుమతించడంతో పాటు థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేసేందుకు కూడా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు. 10 ఏళ్ల లోపు చిన్నారులను, 60 ఏళ్ల పై బడ్డ వారిని అనుమతించబోమని ఆలయాధికారులు వివరించారు.

Advertisement

Next Story