టీఆర్ఎస్‌కు వర్తించని కరోనా 'సోషల్ డిస్టెన్స్' !

by Shyam |   ( Updated:2020-03-21 03:34:24.0  )
టీఆర్ఎస్‌కు వర్తించని కరోనా సోషల్ డిస్టెన్స్ !
X

దిశ, న్యూస్ బ్యూరో:

కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతతో, స్వీయ క్రమశిక్షణతో ప్రభుత్వానికి సహకారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చినవారు స్వచ్ఛందంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని షరతు విధించారు. కానీ ఇవేవీ అధికార పార్టీకి వర్తించవేమో అనే అభిప్రాయం కలుగుతోంది. టీఆర్ఎస్‌కు చెందిన సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే అమెరికా నుంచి వచ్చిన తర్వాత క్వారంటైన్‌కు వెళ్ళకుండా మున్సిపల్ అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. ఇక నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ ఎంపీ కవిత పోటీ చేస్తున్నందున అదికార పార్టీకి చెందిన ఓట్లను పూర్తి స్థాయిలో పొందేందుకు వారికి ఆ పార్టీ హైదరాబాద్ శివార్లలో ఒక విందు పార్టీని ఏర్పాటు చేసింది. ‘సోషల్ డిస్టాన్స్’ పాటించాలని ఆ పార్టీ కోరుతూనే వందలాది మంది ఒకేచోట గుమికూడే పార్టీని ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది.

నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ కూడా ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. వీడియోను కూడా పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ జాగ్రత్తలు చెప్పే అధికార పార్టీ ఈ విషయాన్ని మాత్రం గాలికొదిలేసింది. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 800కు పైగా ఓటర్లు ఓటు వేయాల్సి ఉంటుంది. ఇందులో టీఆర్ఎస్‌కు 90% ఓట్లు పడతాయని ఆ జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఒకింత గర్వంగానే ప్రకటించుకున్నారు. ఇంత ధీమా ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తదితరులకు విందు పార్టీ ఎందుకిచ్చినట్లు అని వస్తున్న ప్రశ్నలకు మాత్రం టీఆర్ఎస్ పెద్దల నుంచి సమాధానం కరువైంది. నిజంగా కరోనా వ్యాప్తి నివారణ పట్ల అధికార పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే వందలాది మందికి విందు ఎందుకు ఏర్పాటుచేసినట్లు? ఒకేచోట అంత భారీ సంఖ్యలో జనం గుమికూడేలా కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటుచేసినట్లు? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

పెళ్ళిళ్ళ సమయంలో వధూవరుల వైపు నుంచి కూడా గరిష్టంగా 200 మందికంటే ఎక్కువ గుమికూడకుండా చూసుకోవాలని, కల్యాణ మండపాలను మూసివేయాలని (రిజర్వు చేసుకున్న పెళ్ళిళ్ళకు మినహా) ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పెళ్ళిళ్ళ కోసం 200 మంది పరిమితి విధించిన సీఎం ఇప్పుడు అధికార పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అంతకంటే మూడు రెట్ల మందిని ఎలా అనుమతించిందన్న ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. ఆ విందు కార్యక్రమానికి హాజరైన పలువురు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అత్యుత్సాహంతో సెల్ఫీలు తీసుకున్నారు. సెల్ఫీ వీడియోలూ తీసుకున్నారు. అవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విందు కార్యక్రమంలో చేతిలో మద్యం బాటిల్‌తో ఒక ప్రజా ప్రతినిధి కనిపించడం గమనార్హం. ఒకవేళ ఈ కార్యక్రమం అధికార పార్టీకి చెందినది కాకపోయినట్లయితే సదరు ఈవెంట్ నిర్వాహకులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటన్నది కూడా సమాధానంలేని ప్రశ్నగానే మిగిలిపోయింది.

TAGS : corona, trs, kavita, mlc, elections, nizamabad, kcr, cm, dharmapuri aravind, hyderabad

Advertisement

Next Story

Most Viewed