నగర రోడ్లు నిర్మానుష్యం

by Shyam |
నగర రోడ్లు నిర్మానుష్యం
X

దిశ, న్యూస్​ బ్యూరో: ప్రధాని, ముఖ్యమంత్రి పిలుపు మేరకు నగరంలో జనతా కర్ఫ్యూ ఆదివారం విజయవంతమైంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేదు. జీహెచ్​ఎంసీ యంత్రాంగం, పోలీసులు, మీడియా, వైద్య సిబ్బంది మినహా మిగిలినవరేవరూ రోడ్ల మీదకు అంతగా రాలేదనే చెప్పాలి. అత్యవసర పనుల మీద, బయట ఎలా ఉందనే ఆసక్తి కొద్దీ వచ్చిన వారిని పోలీసులు మర్యాదపూర్వకంగా ఇండ్లకు వెళ్లాల్సిందిగా కోరారు. మెట్రో రైళ్లు సహా అన్ని ప్రయాణ సర్వీసులు ఆగిపోవడంతో రోడ్లపై జనాలు కనిపించలేదు. ఎక్కువగా జనసంచారం ఉండే చార్మినార్​, నాంపల్లి, కోఠి, ఎంజీబీఎస్​, మెట్రో స్టేషన్ల పరిసరాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. జనాలు లేక పార్కులు, రోడ్లు ఖాళీగా కనిపించాయి.
జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది ఉదయం వేళల్లో తమ విధులను నిర్వర్తించారు. వీధులను శుభ్రపరచడంతోపాటు బ్లీచింగ్​ పౌడర్​ను చల్లారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా నగరంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పలు ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల వద్ద గస్తీ కాస్తూ ఉన్నారు. రోడ్లపై తిరిగే వారికి ట్రాఫిక్​ పోలీసులు కోరానాపై అవగాహన కల్పించారు. బల్దియా పరిధిలో ప్రజాప్రతినిధులు సెల్ఫ్​ క్వారెంటైన్​లో ఉన్నారు. నగర మేయర్​ బొంతు రామ్మోహన్​ కుటుంబ సభ్యులతో ఇంట్లోనే గడిపారు. నగరంలో పలుచోట్ల మెడికల్​ సిబ్బంది, వాహనాలు అందుబాటులో ఉంచారు. సాయంత్రం 5గంటల సమయంలో ప్రజలు పెద్దఎత్తున బయటకు వచ్చి ఈలలు, చప్పట్లతో మద్దతు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed