కరోనా టెస్టుల కోసం త్వరలో మొబైల్ కియోస్క్‌లు..

by Shyam |
కరోనా టెస్టుల కోసం త్వరలో మొబైల్ కియోస్క్‌లు..
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే తొమ్మిది లేబొరేటరీలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంచార పరీక్షా కేంద్రాల(మొబైల్ టెస్టింగ్ కియోస్క్)ను నెలకొల్పే దిశగా ఆలోచనలు చేస్తోంది. కంటైన్‌మెంట్ జోన్లలో ఇంటింటికీ తిరిగి ఆరోగ్య వివరాలను తీసుకుంటున్న వైద్యారోగ్య శాఖ సిబ్బంది కరోనా లక్షణాలు ఉన్నవారిని, అనుమానితులను వేరు చేసి వారి నుంచి నమూనాలను సేకరించి లేబొరేటరీలకు పంపుతున్నారు. అయితే సత్వరం పరీక్షలు చేసేందుకు, రిపోర్టును తెప్పించుకునేందుకు వీలుగా ఇప్పుడు సంచార పరీక్షా కేంద్రాల గురించి ఆలోచిస్తోంది. వీటిని నెలకొల్పాలని సూత్రరీత్యా నిర్ణయం జరిగింది. ఈ వారంలోనే వాటిని తీర్చిదిద్ది రోడ్లమీదకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న 108 ఆంబులెన్స్ల తరహాలోనే ఈ సంచార కేంద్రాలు కూడా ఉంటాయి. ఇందుకు అవసరమైన వైద్య పరికరాలను, జనరేటర్ లాంటి సౌకర్యాలను అమర్చే ప్రక్రియ జరుగుతోంది. నాలుగైదు రోజుల్లోనే ఇవి వినియోగంలోకి రానున్నట్లు సమాచారం.

ప్రస్తుతం పాటిస్తున్న విధానాల ప్రకారం అనుమానితులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు ధృవీకరిస్తే వారిని ఆసుపత్రికి తరలించి నమూనాలను సేకరిస్తున్నారు. లేబొరేటరీ నుంచి రిపోర్టు వచ్చేంతవరకు వారిని ఐసొలేషన్ కేంద్రాల్లో ఉంచుతున్నారు. ఇందుకు సగటున ఒక రోజు కంటే ఎక్కువ సమయం పడుతోంది. కంటైన్‌మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేసిన తర్వాత కరోనా పాజిటివ్ పేషెంట్లతో ప్రైమరీ, సెకండరీ, ఆ తర్వాతి కాంటాక్టుల్లో ఉన్నవారికి కూడా పరీక్షలు జరుగుతున్నాయి. రోజుకు సుమారు 1500 పరీక్షలు చేసే సామర్థ్యం మన లేబొరేటరీలకు ఉన్నప్పటికీ 600 కూడా దాటడం లేదు. అయినప్పటికీ రిపోర్టు సకాలంలో రావడంలో జాప్యం జరుగుతోంది. దీన్ని నివారించడం కోసమే మొబైల్ టెస్టింగ్ కియోస్క్‌లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన. అక్కడికక్కడే పరీక్షలు చేసి రిపోర్టులు వస్తే చాలా సమయం కలిసొస్తుందని, వైరస్ వ్యాప్తి వేగాన్ని కట్టడి చేయవచ్చని వైద్యారోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ సంచార పరీక్షా కేంద్రాలను ఎక్కువగా కంటైన్‌మెంట్ క్లస్టర్ల పరిధిలోనే ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంతో పాటు సూర్యాపేట, గద్వాల, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా కంటైన్‌మెంట్ క్లస్టర్లు ఉన్నందున అక్కడ ఉంచేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం తొమ్మిది లేబొరేటరీలు ఉన్నప్పటికీ ఒకటి వరంగల్‌లో ఉంటే మిగిలినవన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అయితే జిల్లా కేంద్రాల్లో అనుమానిత కేసులు వస్తే వారి నుంచి నమూనాలను సేకరించి హైదరాబాద్‌కు పంపాల్సి వస్తోంది. దీనివల్ల రాకపోకలకు సమయం పడుతోంది. అప్పటిదాకా సదరు పేషెంట్‌తో గత కొన్ని రోజులుగా కాంటాక్టులో ఉన్నవారిని గుర్తించి క్వారంటైన్ లేదా ఐసొలేషన్‌కు పంపడానికి సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని సంచార లేబొరేటరీని అక్కడే నెలకొల్పడం ద్వారా ఆరేడు గంటల వ్యవధిలోనే రిపోర్టు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా సమయం కలిసొస్తుందని, అప్పటికల్లా పేషెంట్‌తో పాటు వారి కాంటాక్టులో ఉన్నవారందరినీ గుర్తించే ప్రక్రియ వేగవంతమవుతుందని వైద్యారోగ్య శాఖ అధికారుల అభిప్రాయం.

తొలి దశలో ఇరవై సంచార పరీక్షా కేంద్రాలను నెలకొల్పాలనుకుంటున్నప్పటికీ అవసరాన్ని బట్టి వీటి సంఖ్యను పెంచడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నమూనాలను పరీక్షించడానికి అవసరమైన
ఉపకరణాలను వ్యాన్ లోపల అమర్చే ప్రక్రియ జరుగుతున్నట్లు సమాచారం. ఇంతకాలం 108 ఆంబులెన్స్ అవసరాల కోసం వాడిన వాహనాలనే ఇప్పుడు వాడాలనే నిర్ణయం జరిగింది. కొత్తగా అందుబాటులోకి వచ్చే
ఇరవై మొబైల్ టెస్టింగ్ లేబొరేటరీలలో రెండింటిని కింగ్ కోఠి ఆసుపత్రి ఆవరణలోనే ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. మిగిలినవాటిని నగరంతో పాటు మూలల్లో ఉన్న జిల్లా కేంద్రాలకు తరలించాలని అనుకుంటున్నారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని, ల్యాబ్ టెక్నీషియన్లను గుర్తించే ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. వైరస్ వ్యాప్తి ఉన్న ప్రాంతాలపైనే ప్రస్తుతం ప్రధాన దృష్టి ఉంది. వీటిని జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణలోనే ఉంచనున్నట్లు తెలిసింది. ఈ ప్రత్యామ్నాయం వల్ల జిల్లాల్లో అనుమానిత పేషెంట్ల నమూనాలను వ్యయప్రయాసలకోర్చి హైదరాబాద్ లేబొరేటరీ దాకా పంపాల్సిన అవసరం తప్పుతుంది. గంటల వ్యవధిలోనే అక్కడికక్కడ రిపోర్టు రావడం, దానికి అనుగుణంగా పేషెంట్‌ను సంబంధిత ఆసుపత్రికి తరలించడంపై వైద్యాధికారులు నిర్ణయం తీసుకోడానికి వీలవుతుంది.

Tags:Telangana, Mobile Testing Kiosk, Corona, Containment Cluster, Laboratory

Advertisement

Next Story

Most Viewed