పేదల పొట్టకొడుతున్న కేసీఆర్.. ‘స్వగృహ’ ఇళ్ల అమ్మకాలపై మాస్టర్ ప్లాన్‌..

by Anukaran |   ( Updated:2021-10-01 23:28:58.0  )
పేదల పొట్టకొడుతున్న కేసీఆర్.. ‘స్వగృహ’ ఇళ్ల అమ్మకాలపై మాస్టర్ ప్లాన్‌..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాజీవ్ స్వగృహ ఇండ్లు కూడా కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకే వెళ్లనున్నాయి. సర్కారుకు అనుకూలంగా అంటకాగే రియల్​సంస్థలు వాటిపై కన్నేశాయి. దీంతో టెండర్ల ప్రతిపాదనలనే మార్చేశారు. ఇప్పటి వరకు పేద, మధ్య తరగతి వర్గాలకు తక్కువ ధరకు దక్కుతాయనుకున్న స్వగృహ ఇండ్లు.. ఇప్పుడు డబుల్​ ధరతో అమ్మకానికి పెట్టనున్నారు. పేద, మద్య తరగతి వర్గాల కోసం నిర్మించిన రాజీవ్ స్వగృహ ఇండ్లను ఏకమొత్తంలో అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాజీవ్ స్వగృహ టవర్లు రియల్ ఎస్టేట్ యజమానులు, సంపన్నుల పరమే కానున్నాయి. రాజీవ్​స్వగృహ ఇండ్లను విడివిడిగా కాకుండా టవర్ మొత్తాన్ని ఒకే యూనిట్‌గా విక్రయించాలని ప్రభుత్వం తాజాగా రాజీవ్​స్వగృహ కార్పొరేషన్‌ను ఆదేశించింది. వచ్చే వారం నుంచి వీటికి టెండర్ల ప్రక్రియ మొదలుకానుంది.

ఇదీ అధికారుల నివేదిక..

రాజీవ్ స్వగృహ ఇండ్ల అమ్మకాలపై ముందడుగు పడింది. ఇప్పటి వరకు భూముల అమ్మకాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు స్వగృహ సముదాయాలను విక్రయించనుంది. ముందుగా బండ్లగూడ, పోచారం రాజీవ్ స్వగృహ సముదాయాలకు టెండర్లు వేయనున్నారు. బండ్లగూడలో 33, పోచారంలో 19 టవర్లను అమ్మకానికి పెడుతున్నారు. దీనిపై రాజీవ్ స్వగృహ కార్పొరేషన్​ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

ప్రస్తుతం బండ్లగూడలో 33 స్వగృహ టవర్లు ఉండగా.. ఒక్కో టవర్‌లో 54 నుంచి 108 ప్లాట్లున్నాయి. టవర్ల వారీగా చేస్తూ ట్రిపుల్ బెడ్ రూం ప్లాట్లు అయితే 54 ఉండగా, డబుల్ బెడ్ రూం ప్లాట్లు 72 ఉన్నాయి. సింగిల్ బెడ్ రూం ప్లాట్లు 108 చొప్పున నిర్మించారు. ప్రస్తుత మార్కెట్​ధరలు, అక్కడి నిర్మాణాలు, పరిస్థితుల ప్రకారం ఎలా అమ్మకాలు చేయాలనే అంశాలను అధికారులు నివేదికల్లో వివరించారు. ఉదాహరణగా బండ్లగూడ రాజీవ్​స్వగృహ సముదాయంలో ఒక్కో ప్లాట్‌ను విక్రయించాలని, స్క్వేర్ ఫీట్‌కు సగటున రూ. 3,100 వరకు ధర నిర్ధారించాలని పేర్కొన్నారు. ఈ ధరతో మధ్య తరగతి వర్గాలకు అనుకూలంగా ఉంటుందని నివేదికల్లో వివరించారు.

వద్దు.. కంపెనీలకు ఇవ్వండి

ప్లాట్లుగా విక్రయించాలంటూ అధికారుల నివేదికను ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇప్పటి వరకు ప్లాట్లుగా విక్రయాలు చేస్తే కొనుగోలు చేస్తామంటూ గంపెడాశలతో ఉన్న మధ్య తరగతి వర్గాలకు నిరాశ ఎదురయ్యే నిర్ణయం తీసుకున్నారు. ప్లాట్ల వారీగా కాకుండా.. టవర్ యూనిట్‌గా అమ్మాలని సీఎం.. అధికారులను ఆదేశించారు. అధికారుల నివేదికను పక్కన పెట్టారు. కొన్ని బడా నిర్మాణ సంస్థలు ఈ ఇండ్లపై కూడా కన్నేయడంతోనే టెండర్ల ప్రతిపాదనలు మార్చివేసినట్లు తెలుస్తోంది. ఒక్కో టవర్‌కు సగటున రూ. 20 నుంచి రూ. 30 కోట్ల వరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో మధ్య తరగతి వర్గాలు వీటిని కొనడం సాధ్యం కాదు.

టెండర్లు వేసి.. రంగులు మార్చి

పేదలు, మధ్య తరగతి వర్గాల కోసం నిర్మించిన ఈ ఇండ్లలో ప్రభుత్వం ఆదాయం కోసమే కక్కుర్తి పడినట్లు అవుతోంది. ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే రియల్ సంస్థలు.. వాటిని ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకోనున్నారు. ప్రభుత్వ ధరలకు తక్కువగానే టెండర్లు వేసి, టవర్లను దక్కించుకొని అందులోని ప్లాట్లకు కంపెనీలు ఇష్టం వచ్చిన ధరతో విక్రయించుకోనున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం ఇప్పుడు రూ. 3,100 ఎస్‌ఎఫ్‌టీ సూచించగా.. ఇదే సాకుతో డబుల్ ధరలు పెట్టనున్నారు. ఇప్పటికే నిర్మించిన ఇండ్లను ఎంతో కొంత రంగులు మార్చి, మార్పులు చేసి, వాటిని అందంగా చూపించి ఎక్కువ ధరకు అమ్మకాలు చేసేందుకు కార్పొరేట్ కంపెనీలు కొత్త ప్లాన్ వేశాయి. దీంతోనే టవర్ యూనిట్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం సూచించిన విధంగా ఎస్ఎఫ్‌టీకి రూ. 3,100 కార్పొరేట్​కంపెనీల చేతుల్లోకి వెళ్లగానే దాదాపు రూ. 5 వేల నుంచి రూ. 6 వేలకు చేరే అవకాశాలున్నాయి.

పాతోళ్ల పరిస్థితి ఏమిటీ..?

వాస్తవానికి బండ్లగూడలో కొన్ని ప్లాట్లను ఇప్పటికే విక్రయించారు. కొన్నింటిలో జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ప్లాట్‌గా కాకుండా టవర్‌గా విక్రయించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనుకున్నట్టే కార్పొరేట్ కంపెనీలు టవర్లను దక్కించుకుంటే.. వారి ఒత్తిళ్లను తట్టుకోలేక ఇప్పుడు కొనుగోలు చేసిన వారు కూడా వారికే అమ్ముకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

Next Story