విద్యార్ధుల భవిష్యత్తుపై సీఎం శీతకన్ను.. ఫిజికల్ క్లాసులపై రివ్యూ పట్టదా.?

by Anukaran |   ( Updated:2021-08-16 22:02:24.0  )
విద్యార్ధుల భవిష్యత్తుపై సీఎం శీతకన్ను.. ఫిజికల్ క్లాసులపై రివ్యూ పట్టదా.?
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్కూళ్లను ఎప్పుడు ప్రారంభించాలని ప్రభుత్వం తర్జనా భర్జన పడుతోంది. కరోనా భయం వెంటాడుతుండటంతో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలను తీసుకోలేకపోతున్నది. మార్గదర్శకాలను విడుదల చేసేందుకు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే తరగతులను ప్రారంభించిన పొరుగు రాష్ట్రాల్లోని అనుభవాలను చూసిన తరువాతే ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. విద్యాసంస్థల నిర్వహణపై ఇతర రాష్ట్రాల సీఎంలు పలుమార్లు రివ్యూలు చేపట్టి నిర్ణయం తీసుకోగా సీఎం కేసీఆర్ ఒక్క రివ్యూను కూడా చేపట్టడం లేదు. విద్యాశాఖను నిర్లక్ష్యం చేయడం వలన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలల్లో ఫిజికల్ తరగతులను ఎప్పటి నుంచి నిర్వహిస్తారనే అంశాలను ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించలేదు. సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ వాటిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. దాదాపు ఏడాదిన్నరగా ఫిజికల్ తరగతులు నిలిచిపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాల ఆవరణాలను పూర్తిగా మరిచిపోతుండటంతో విద్యానైపుణ్యాలు కొరవడుతున్నాయి.

వెంటాడుతున్న కరోనా భయం..

కరోనా భయం ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. వైద్యారోగ్య శాఖ, పలు జాతీయ సంస్థలు కరోనాపై స్పష్టతను ఇస్తున్న కారణంగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. పాఠశాలలు ప్రారంభిస్తే వైరస్ ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న అంశాలను అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. విద్యాసంస్థల నిర్వహణ మార్గదర్శకాలను విడుదల చేసేందుకు సంకోచిస్తున్నారు. ఇప్పటికే తరగతులను ప్రారంభించిన ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులను గమనించిన తరువాతే తుది నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటి వరకు రివ్యూచేయని సీఎం కేసీఆర్..

కరోనా పరిస్థితులు నెలకొన్నప్పటి నుంచి విద్యాశాఖపై సీఎం కేసీఆర్ ఒక్క రివ్యూను కూడా నిర్వహించలేదనే విమర్శలు వెల్లువెతున్నాయి. కరోనా పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పడు ఎలాంటి ఆలోచనలు లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని ఇతర రాష్ట్రాల సీఎంలు విద్యాశాఖపై పలు రివ్యూలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

విద్యార్థులు నష్టపోకుండా తగిన చర్యలు చేపట్టి విద్యా వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, మన రాష్ట్రంలో ఇప్పటి వరకూ విద్యాశాఖపై రివ్యూలు నిర్వహించకపోవడం, కీలక నిర్ణయాలను తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఒక తరం విద్యార్థుల భవిష్యత్తు అంధకారం కానుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed