అందుకే ‘పార్టు బీ’ భూములపై ఫోకస్​

by Anukaran |
అందుకే ‘పార్టు బీ’ భూములపై ఫోకస్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : ధరణి పోర్టల్​ అమల్లోకి వచ్చిన నుంచి పట్టాదారు పాసు పుస్తకాలు రాని రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2017 సెప్టెంబరు 15 నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. ఆ సమయంలో వివిధ కారణాలతో లక్షలాది ఎకరాల భూమిని పార్టు బీ కింద నమోదు చేశారు. కాగా, 2018 మే నుంచి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి పట్టాదారు పాసు పుస్తకానికి నోచుకోని పార్టు బీ భూముల రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. చిన్న కారణాలతో పక్కకు పెట్టడంతో ధరణి పోర్టల్​లో పేర్లు లేకపోవడంతో భూములు ఏమవుతాయోనని ఆందోళన చెందుతున్నారు.

అధికారుల నుంచి కూడా సరైన స్పందన లేకపోవడంతో గొడవకు దిగుతున్నారు. సాధ్యమైనంత త్వరగా వివాదాలు పరిష్కరించకపోతే సమస్యలు పెరిగే అవకాశాలుండడంతో సీఎం కేసీఆర్ ప్రత్యక్ష్యంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 7 లేదా 9 తేదీల్లో కలెక్టర్లతో నేరుగా సమీక్షించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో అన్ని కలెక్టరేట్లు, రెవెన్యూ కార్యాలయాల్లో పరుగుల మీద పార్టు బీ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? పరిష్కారం ఏమిటి? అన్న కోణంలో నివేదికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇన్ని రోజులుగా సీనియర్ ​ఐఏఎస్ ​అధికారులకు పరిష్కార మార్గాలను చూడాలని సూచించినా ఫలితం దక్కలేదు. అందుకే సీఎం కేసీఆర్​ వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

అధికారాల కోతతోనే..

తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకం–2020 చట్టం ద్వారా తహసీల్దార్, ఆర్డీఓ, జేసీలకు అధికారాలు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే పార్టు బీ భూముల వివాదాల జోలికి వెళ్లడం లేదు. రాష్ట్రంలో సుమారు 18 లక్షల ఎకరాల సాగు భూమిని వివాదాస్పదంగా గుర్తించారు. ఇందులో పట్టా పాసు పుస్తకంలో, క్షేత్రస్థాయిలో తేడాలుండడం, సరిహద్దు వివాదాలు వంటి ఎన్నో అంశాలతో పాసు పుస్తకాల జారీ, రికార్డుల్లో నమోదు జరగలేదు. దీంతో ధరణిలో కనిపించకపోవడంతో కొత్త పాసు పుస్తకం నిలిచిపోవడంతో క్రయ విక్రయాలకు అవకాశం లేకుండా పోయింది.

తరతరాలుగా అనుభవిస్తున్న భూమిని అమ్ముకోలేని దౌర్భాగ్యం నెలకొంది. మొత్తంగా పార్టు బీ వివాదాల పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందిస్తే ఎన్నో లక్షల మందికి మేలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. రోజూ ఆఫీసుకు వచ్చి వారి భూముల గురించి, పాసు పుస్తకాల గురించి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నట్లు వాపోయారు. ఇప్పటికైనా సీఎం జోక్యం చేసుకోవడంపై తహసీల్దార్లు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story