- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రంలో మూడింట రెండొంతుల కేసులు 40 ఏళ్ళలోపు వారికే ..
– పాజిటివ్ కేసుల్లో 60 ఏళ్ళు దాటినవారు 9 శాతమే
దిశ, న్యూస్ బ్యూరో: ‘కరోనా వైరస్ ఎక్కువగా వృద్ధులకే సోకుతుంది.. యుక్తవయసు వారికి రాదు.. ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో వైరస్ బతకలేదు..’ లాంటి అనేక రకాల కామెంట్లను ఇప్పటిదాకా విన్నాం. కానీ వీటికెక్కడా శాస్త్రీయత లేదని తెలంగాణలో నమోదవుతున్న కేసుల విశ్లేషణను చూస్తే తెలిసిపోతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది (తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్ లెక్కల ప్రకారం). రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అనేక కోణాల నుంచి విశ్లేషించింది. అందులో ఒక విశ్లేషణ ప్రకారం.. మొత్తం పాజిటివ్ కేసుల్లో సుమారు 45% మంది 20 నుంచి 40 ఏళ్ళ మధ్య వయస్కులే. వీరిలో టీనేజర్స్ సుమారు 10% మేర ఉన్నట్లు తేలింది. ఇక 41 నుంచి 50 ఏళ్ళ మధ్య వయస్కులు 15% మంది, 51 నుంచి 60 ఏళ్ళ మధ్య వారు 13% చొప్పున ఉన్నారు. ఐదేళ్ళలోపు చిన్నారులకు కూడా వైరస్ సోకడంతో మొత్తం కేసుల్లో వారు సుమారు 5% మేర ఉన్నట్లు తేలింది. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం పాజిటివ్ పేషెంట్లలో సుమారు 64% మంది నలభై ఏళ్ళ వయసులోపు వారేనని స్పష్టమవుతోంది.
తొలుత విదేశీ ప్రయాణం చేసినవారి ద్వారా వైరస్ వ్యాపించి సుమారు 65 మంది పాజిటివ్ పేషెంట్లు అయ్యారని ముఖ్యమంత్రి ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మర్కజ్ పర్యటనకు వెళ్ళిరావడం ద్వారా విస్తృతంగా వ్యాపించి వందలాది మంది పాజిటివ్ బారిన పడ్డారని, సుమారు 85% కేసుల్లో ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఢిల్లీ మర్కజ్‌కు సంబంధించినవేనని అన్నారు. కానీ ఈ రెండింటితోనూ సంబంధం లేకుండా, ఎలాంటి ప్రయాణం చేయకుండా పాజిటివ్ బారిన పడిన పేషెంట్లు కూడా ఉన్నారు. సూర్యాపేటలో కిరణా దుకాణం నడిపే మహిళ, ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన బాలిక ఇందుకు నిదర్శనం. వీరికి ఎవరి ద్వారా నిర్దిష్టంగా ఈ వైరస్ సోకిందో తెలియదుగానీ ఒక ఫార్మసీ దుకాణం ద్వారా సూర్యాపేట మహిళకు, పోస్టుమెన్ ద్వారా గిరిజన బాలికకు సోకినట్లు జిల్లా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. పట్టణాల్లోనే ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్నా ఆసిఫాబాద్ గిరిజన బాలికకు, ఖమ్మం జిల్లాలో ఒక లంబాడీ తండా యువకుడికి వైరస్ సోకడం గమనార్హం.
మృతుల విషయాన్నే చూసుకుంటే వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ లెక్కల ప్రకారం.. 15 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు వివిధ అనారోగ్య కారణాలతోనే చనిపోయారని పేర్కొన్నారు. మిగిలిన పది మందికి కరోనా ఉన్నప్పటికీ వృద్ధాప్య సమస్యలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం కారణమన్నారు. అయితే వైద్యాధికారులు ఇంకా ఈ విషయంలో లోతుగా విశ్లేషణ చేయాల్సి ఉంది. నిర్దిష్టంగా చనిపోవడానికి కారణం వైరస్ మాత్రమేనా లేక అప్పటికే ఎదుర్కొంటున్న సీరియస్ అనారోగ్య సమస్యలా అనేది తేల్చడానికి కమిటీ కృషి చేస్తున్నదని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా చనిపోయిన పాతికమంది ఆరు జిల్లాలకు చెందినవారే. గరిష్టంగా 18 మంది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు చొప్పున ఉండగా వికారాబాద్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.
ఇంకా మరిన్ని కోణాల నుంచి వైద్యారోగ్య శాఖ అధికారులు విశ్లేషణ చేస్తున్నారు. పాజిటివ్ పేషెంట్లలో డైరెక్ట్ (విదేశీ ప్రయాణం, మర్కజ్ లాంటివి) ఉన్నవారు ఎంతమంది, వారి ద్వారా ప్రైమరీ కాంటాక్టులో ఉండి పాజిటివ్ నిర్ధారణ అయినవారు ఎంతమంది, సెకండరీ కాంటాక్టులు ఎంతమంది.. ఇలా లోతైన విశ్లేషణ చేసి నివేదిక రూపొందించే పని ప్రారంభమైంది. వ్యాధి లక్షణాలతో పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారు, వ్యాధితో సంబంధం లేకుండా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినవారు అనే కోణం నుంచి కూడా విశ్లేషణ జరుగుతోంది. సూర్యాపేటలో ఒక్కసారిగా కేసులు పెరగడానికి ‘కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్’ కారణం కాదని వైద్యారోగ్య శాఖ అధికారులు భావిస్తున్నా అది ‘లోకల్ ట్రాన్స్‌మిషన్’ అనే అంచనాకు వచ్చారు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌కు వెళ్ళాలంటే మధ్యలో ‘ఎక్స్‌టెన్సివ్ లోకల్ ట్రాన్స్‌మిషన్’ అనే దశ కూడా ఉంటుందని ఆ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.
Tags: Telangana, Corona, Young Adults, Positive Cases, Middle Aged