కేంద్రంతో కేసీఆర్​ కాళ్లబేరం.. కాంగ్రెస్ ఫైర్​

by Shyam |
కేంద్రంతో కేసీఆర్​ కాళ్లబేరం.. కాంగ్రెస్ ఫైర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్​ ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు మండిపడుతున్నారు. గాంధీభవన్​లో శనివారం పలువురు నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రంతో సీఎం కేసీఆర్‌ కాళ్ల బేరం చేసుకుంటున్నారని కాంగ్రెస్ నేత మధుయాష్కి ఎద్దేవా చేశారు. దేవుడినైనా ఎదురిస్తానన్న కేసీఆర్ కేంద్రంతో కాళ్ల బేరానికి వెళ్లారని, అధికారులు లేకుండా కేంద్రమంత్రి అమిత్‌షాతో కేసీఆర్‌ భేటీ వెనుక అర్ధమేమిటని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కాంగ్రెస్‌ను దొంగ దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నాయని, బీజేపీకి కేసీఆర్ మేయర్ పదవి ఆఫర్ చేశాడని ప్రచారం జరుగుతోందని, సీఎం కేసీఆర్ మంత్రివర్గం అలీబాబా నలభై దొంగలుగా మారిందని ధ్వజమెత్తారు. ఎఫ్ఐఆర్ నమోదైన మంత్రి మల్లారెడ్డి రాజీనామా చేయడం లేదని, భూకబ్జాలు చేస్తోన్న ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రజలే కేసీఆర్ గడీలను బద్దలు కొడతారని మధుయాష్కి హెచ్చరించారు.

సీఎం కేసీఆర్‌కు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలోని రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్‌ డిమాండ్ చేశారు. కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో ఉన్న రహస్య ఎజెండా ఏంటో చెప్పాలని, మోదీని వ్యతిరేకించిన వారిపై ఈడీ, సీబీఐ దాడులు జరిగాయని, ఒక్క సీఎం కేసీఆర్ మీద మాత్రమే ఇప్పటి వరకు జరగలేదన్నారు. కేసులకు భయపడే సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన చేస్తున్నారని పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు.

బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ అలయ్ బలయ్‌ తీసుకుంటున్నాయని, సీఎం కేసీఆర్ రైతులను నిండా ముంచుతున్నారని, సన్న వరి పండించిన రైతులకు ఎకరానికి రూ. 10వేలు పరిహారం ఇవ్వాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్బంధం వల్ల పంట దిగుబడి తగ్గిందని, రైతులకు ప్రభుత్వం కనీసం సహాయం కూడా చేయలేదని, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని కూడా ప్రభుత్వం అంచనా వేయలేదని జీవన్​రెడ్డి దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదనడం శుద్ధ అబద్ధమని, కేసీఆర్ ఏం రాజకీయ ప్రయోజనాల ఆశించి ఢిల్లీకి వెళ్లారని కాంగ్రెస్​ నేత చిన్నారెడ్డి ప్రశ్నించారు.

Advertisement

Next Story