సర్కారు కొత్త ప్లాన్.. దానిపై చర్చకు అసెంబ్లీ సమావేశాలు

by Anukaran |   ( Updated:2021-09-06 00:48:52.0  )
Assembly
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను వీలైనంత త్వరగా జరపాలని ప్రభుత్వం భావిస్తున్నది. దళితబంధు పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైనదిగా భావిస్తున్నందున దీనిపై విస్తృతంగా చర్చ జరపాలని కోరుకుంటున్నది. చట్టబద్ధత కల్పించాలని కూడా కోరుకుంటున్నది. రైతుబంధు తరహాలోనే ఎప్పటికీ ఈ పథకం కొనసాగాలని అనుకుంటున్నది. ఇందుకోసం కనీసం పది రోజుల పాటు సెషన్‌ను నిర్వహించడం సమంజసంగా ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఈ నెల 8వ తేదీ వరకు ఉంటున్నందున తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాతనే దీనిపై స్పష్టత రానున్నది.

బడ్జెట్ సమావేశాలు మార్చి 23వ తేదీతో ముగిసినందున సెప్టెంబరు 23వ తేదీ వరకు వెసులుబాటు ఉన్నది. అప్పటికల్లా సెషన్ మొదలుకావాల్సి ఉంటుంది. కానీ ఈ నెల 17వ తేదీన విమోచన దినోత్సవాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నందున అది ముగిసిన తర్వాతనే అసెంబ్లీ సెషన్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దళితబంధు పథకంపై ఇప్పటికే ప్రభుత్వం ఆశించినట్లుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెక్షన్ల ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నప్పటికీ అసెంబ్లీ వేదికగా చర్చించి రికార్డుల్లో నమోదు చేయాలన్నది ప్రభుత్వ భావన. ఇందుకోసం వీలైనంత ఎక్కువ స్థాయిలో దీనిపై శాసనసభ, మండలిలో చర్చించాలని భావిస్తున్నది.

ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలను కొవిడ్ నిబంధనల నడుమనే జరపాలనుకుంటున్నట్లు తెలిసింది. అసెంబ్లీ సచివాలయ వర్గాలు ఇప్పటికే దీనిపైన ప్రాథమికంగా కసరత్తు మొదలుపెట్టాయి. మీడియా ప్రతినిధులకు ఏ మేరకు అనుమతి ఇవ్వాలనేదానిపై కూడా చర్చించి ఒకటి రెండు రోజుల్లోనే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed