మద్యం తాగేవాళ్లను కాదు.. ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌ను అరెస్ట్ చేయండి

by srinivas |
tdp goutham minan
X

దిశ, ఏపీ బ్యూరో: పలాస నియోజకవర్గంలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులే టార్గెట్‌గా పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మద్యం తాగారనే దానిపై పలాస సీఐ శంకర్రావు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోపాటు వైసీపీ కార్యకర్తలు సైతం తాగారని అయితే వారిని వదిలేసి కేవలం టీడీపీ కార్యకర్తలను మాత్రమే అదుపులోకి తీసుకుని రాత్రంతా స్టేషన్‌లో ఉంచారని ఆమె వాపోయారు. సీఐ శంకర్రావు మంత్రి సీదిరి అప్పలరాజుకు కమిషన్ ఏజెంట్‌గా, బ్రోకర్‌గా మారిపోయారంటూ ఆమె ధ్వజమెత్తారు. మంత్రి సీదిరి అప్పలరాజును విమర్శిస్తున్న టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని వీరంగం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు వైఎస్ఆర్ కడపకు చెందిన డీఎస్పీ శివరామిరెడ్డిని సైతం పలాసకు తీసుకువచ్చి మరీ టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.

మద్యం తాగిన వారిపై కేసులు పెడితే మద్యం తాగాలంటూ ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై ఎన్నికేసులు పెట్టాలని ప్రశ్నించారు. జగన్‌ను అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఉందా అని శిరీష ప్రశ్నించారు. గంటకు 10కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఇతర ఐఏఎస్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారని ఆయనపై కేసులు నమోదు చేస్తారా అని గౌతు శిరీష ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఆమె విమర్శించారు. ఇకనైనా మంత్రి అప్పలరాజుకు కమిషన్ ఏజెంటుగా పనిచేస్తున్న శంకర్రావుపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్‌ను కోరారు. ఇప్పటికే శంకర్రావుపై అనేకసార్లు ఫిర్యాదులు చేశానని అయినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. రోజురోజుకు సీఐ శంకర్రావు అరాచకాలు ఎక్కువ అవుతున్నాయని.. పోలీస్ శాఖ కళ్లు తెరవకపోతే ప్రజలే అతడిపై తిరగబడతారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష హెచ్చరించారు.

Advertisement

Next Story