- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పవన్‌తో మళ్లీ టీడీపీ పొత్తు..? బయటపెట్టిన తెలుగు తమ్ముళ్లు
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం-జనసేన పార్టీల మధ్య పొత్తు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. పరిషత్ ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలలోని కొన్ని చోట్ల జనసేన పార్టీతో టీడీపీ చేతులు కలిపింది. దీంతో కొన్ని చోట్ల ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకున్నాయి. అలాగే జెడ్పీటీసీ అభ్యర్థులను సైతం గెలిపించుకున్నాయి. అధిష్టానంకు సంబంధం లేకుండా స్థానికంగా ఉన్న నేతలు పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. చివరకు ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో భవిష్యత్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకుంటే ఘన విజయం సాధిస్తామని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు పొత్తుపై చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అటు జనసైనికులు సైతం పవన్ కల్యాణ్ వద్ద కూడా చర్చించినట్లు సమాచారం. టీడీపీ-జనసేనల మధ్య పొత్తు ఉంటే 2014 ఎన్నికల్లోని ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకు స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనమని చెప్పుకొస్తున్నారు.
పరిషత్ ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ శాతం
2019 సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మూడు ఎన్నికలు జరిగాయి. పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందభి మోగించింది. అయితే ఈ ఎన్నికల్లో స్థానిక పరిస్థితులను బట్టి జనసేన-టీడీపీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇద్దరూ కలిసి కొన్ని చోట్ల అభ్యర్థులను బరిలోకి దించారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున 1209 మంది సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. అలాగే 1576 ఉపసర్పంచ్‌లను జనసేన కైవసం చేసుకుంది. అలాగే 4,456 వార్డు మెంబర్లను తన ఖాతాలో వేసుకుంది. మెుత్తానికి పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ 24శాతం ఓట్లను సాధించింది. పరిషత్ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ తన సత్తా చాటింది. రాష్ట్రవ్యాప్తంగా 177 స్థానాల్లో విజయంసాధించింది. అలాగే రెండు జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. మెుత్తానికి పరిషత్ ఎన్నికల్లో జనసేన ఓటింగ్ శాతం 25.2కు పెరిగింది. దీంతో జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుతో పలు మండలాలను కైవసం చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట, తూర్పుగోదావరి జిల్లాలోని పి.గన్నవరం, రాజోలు, మలికిపురం, కడియం ఎంపీపీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.
జనసేనతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నాం: టీడీపీ నేతలు పితాని, గొల్లపల్లి సూర్యారావు
జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తును ప్రజలు స్వాగతిస్తున్నారని..అందుకు ఆచంట ఎంపీపీ విషయంలో జరిగిన పరిణామాలే నిదర్శనమని మాజీమంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆచంట ఎంపీపీ స్థానాన్ని టీడీపీ-జనసేన పార్టీలు కలిపి చేజిక్కించుకున్న నేపథ్యంలో పితాని సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు టీడీపీ-జనసేనలు కలవాల్సిన పరిస్థితి ఉందన్నారు. టీడీపీ-జనసేన పార్టీ కలిసి పనిచేయడం మంచి శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. ఆచంట నుంచే అది ప్రారంభమైందన్నారు. రెండు పార్టీల అధినేతలు ఆలోచించాల్సిన అవసరం ఉందని.. వైసీపీని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని సూచించారు. మరోవైపు టీడీపీ, జనసేన పొత్తుతో సంచలన విజయం ఖాయమని టీడీపీ మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు స్పష్టం చేశారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని రాజోలు, మలికిపురం మండల పరిషత్ విజయమే అందుకు నిదర్శనమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు సాగిస్తున్న వైసీపీకి చరమగీతం పాడాలంటే జనసేన టీడీపీలు చారిత్రక పొత్తు అవసరం తప్పనిసరన్నారు. రెండు పార్టీల అధినేతలు కూడా ఒకసారి ఆలోచన చేసే దిశగా అడుగులు పడాలని గొల్లపల్లి సూర్యారావు సూచించారు.
పవన్ కల్యాణ్ నిర్ణయమే శిరోధార్యం: కందుల లక్ష్మీ దుర్గేశ్
ఉభయగోదావరి జిల్లాలలో జనసేన పార్టీ బలోపేతం చెందుతుందని తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల లక్ష్మీదుర్గేశ్ అన్నారు. పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరుగుతూ వస్తోందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న వైసీపీని ఢీ కొట్టేందుకు జనసేన పార్టీ వ్యూహరచనతో ముందుకు వెళ్తామన్నారు. ఇటీవల జరిగిన మూడు ఎన్నికలలో స్థానిక పరిస్థితుల దృష్ట్యా జనసేన, టీడీపీలు సహకరించుకున్నాయన్నారు. ఇరు పార్టీలు కలిసి ఉభయగోదావరి జిల్లాలలో పలు ఎంపీపీ స్థానాలను దక్కించుకున్నట్లు వెల్లడించారు. ఇక టీడీపీతో పొత్తుపై పార్టీలో ఇంకా చర్చకు రాలేదన్నారు. టీడీపీకి చెందిన కీలక నేతలు జనసేనతో పొత్తుపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అయితే ఈ అంశంపై పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌దే తుది నిర్ణయమన్నారు. ఇకపై జనసేన పార్టీ ప్రజల్లోనే ఉంటుందని కందుల లక్ష్మీ దుర్గేశ్ స్పష్టం చేశారు.
పొత్తు ఆత్మహత్యాసదృశ్యమే: మాదాసు గంగాధరం
టీడీపీ-జనసేనల మధ్య కలయిక ఆత్మహత్యాసదృశ్యమేనని జనసేన పార్టీ మాజీ నేత మాదాసు గంగాధరం అన్నారు. 2014 ఎన్నికల్లో పొత్తు ఫలించిందని చెప్పుకొచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన ఓటమికి టీడీపీయే కారణమన్నారు. అలాంటి టీడీపీతో కలిసి పనిచేయడం సరికాదన్నారు. కాపు సామాజిక వర్గాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు చాలా నీచంగా చూశారన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకలో ఓటమికి టీడీపీయే కారణమన్నారు. టీడీపీతో కలయికపై జనసేన పార్టీనేతలు పునరాలోచించాలని మాదాసు గంగాధరం హితవు పలికారు.
పొత్తు కలిసొచ్చేనా?
2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు పొత్తుపెట్టుకున్నాయి. బీజేపీ కూడా ఈ పార్టీలతో జట్టుకట్టింది. ఈ కూటమికి ప్రజలు పట్టంకట్టారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జనసేన-తెలుగుదేశం పార్టీలు అధికారంలోకి వచ్చాయి. చివరికి 2019 ఎన్నికల్లో విడిపోయాయి. టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ ఆ తర్వాత 2019లో వామపక్షాలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. ఐతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ-జనసేనకు మధ్య తెరవెనుక ఒప్పందం ఉన్నట్లు వైసీపీ నేతలు ప్రచారం చేసి సక్సెస్ అయింది. మెుత్తానికి ఇరు పార్టీలు ఘోరపరాజయం మూటకట్టుకున్నాయి. చివరకు వైసీపీ అఖండ విజయంతో అధికారంలోకి వచ్చాయి. అయితే ఇప్పటికైనా టీడీపీ-జనసేనలు కలిసి 2024 సాధారణ ఎన్నికల్లో బరిలోకి దిగితే 2014 ఎన్నికల ఫలితాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.