తేజస్ నెట్‌వర్క్స్‌తో టాటా సన్స్ కొనుగోలు ఒప్పందం

by Harish |
తేజస్ నెట్‌వర్క్స్‌తో టాటా సన్స్ కొనుగోలు ఒప్పందం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెలికాం, నెట్‌వర్క్ కంపెనీ తేజస్ నెట్‌వర్క్స్‌లో దేశీయ దిగ్గజ టాటా సన్స్‌కు చెందిన అనుబంధ సంస్థ నియంత్రణ వాటాను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ రూ. 1,890 కోట్లని, తమ కంపెనీలోని నియంత్రణ వాటాను అప్పజెప్పే ప్రక్రియ దశలవారీగా ఉండనున్నట్టు తేజస్ నెట్‌వర్క్స్ గురువారం వెల్లడించింది. టాటా సన్స్‌కు చెందిన పనాటోన్ ఫిన్వెస్ట్ ఈ ఒప్పంద ప్రక్రియను పూర్తిచేయనున్నట్టు తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం.. మొదటి దశలో 1.94 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో దాని ధర రూ. 258తో మొత్తం రూ. 500 కోట్లను తేజస్ నెట్‌వర్క్స్ అందుకోనుంది. తర్వాత 3.68 కోట్ల షేర్లను రూ. 258 చొప్పున రూ. 952 కోట్లకు కొనుగోలు చేస్తుంది. అనంతరం 1.55 కోట్ల షేర్లను రూ. 400 కోట్లకు పనాటోన్ ఫిన్‌వెస్ట్ కంపెనీ సొంతం చేసుకోనుంది.

ఇవి కాకుండా అదనంగా వ్యక్తిగత నిర్వహణలో ఉన్నటువంటి 13 లక్షల ఈక్విటీ షేర్లకు రూ. 34 కోట్లను చెల్లించి సొంతం చేసుకుంటుంది. ఈ 13 లక్షల వ్యక్తిగత ఈక్విటీ షేర్లను పనాటోన్ ఫిన్‌వెస్ట్ యాజమాన్యంలోని కొంతమంది సిబ్బంది కొనుగోలు చేయనున్నారు. అలాగే, టాటా గ్రూప్‌లోని పనాటోన్ ఫిన్‌వెస్ట్, ఇతర కొన్ని కంపెనీలు సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం.. తేజస్ నెట్‌వర్క్స్‌కు చెందిన 4.03 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడానికి బహిరంగ ఆఫర్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీని షేర్ల విలువ తేజస్ నెట్‌వర్క్స్‌లో 26 శాతంగా ఉంది.

Advertisement

Next Story