భారత మార్కెట్లో విడుదలైన మైక్రో ఎస్‌యూవీ 'టాటా పంచ్'

by Harish |   ( Updated:2021-10-18 04:36:54.0  )
car11
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘టాటా పంచ్’ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇటీవల అత్యంత ఆసక్తిని రేకెత్తించిన ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 5.49 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ వెల్లడించింది. అంతర్జాతీయంగా కార్ల భద్రతకు సంబంధించి రేటింగ్ అందించే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఎన్‌సీపీఏ ఈ మధ్యనే భారత్‌లో ఓ క్యాంపెయిన్ నిర్వహించింది. ఇందులో భాగంగా పలు కార్లను పరీక్షించగా, అందులో ‘టాటా పంచ్’ మోడల్‌కు అత్యధికంగా 5-స్టార్ రేటింగ్ రావడం విశేషం. ఆ తర్వాత నుంచి ఈ వాహనం కోసం వినియోగదారులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ కొత్త సబ్-కాంపాక్ట్ మైక్రో ఎస్‌యూవీ కోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొనుగోలు చేయాలని భావించేవారు టాటా మోటార్స్ అధికారిక వెబ్‌సైట్ లేదంటే డీలర్‌షిప్‌ల వద్ద ముందుగా రూ. 21,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ మైక్రో ఎస్‌యూవీ పిల్లల భద్రతకు 4-స్టార్ రేటింగ్ సాధించడం పట్ల ఆదరణ అందుకుంటోంది. ఇందులో 7-ఇంచుల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్, 4-స్పీకర్స్, ఆటో హెడ్‌లైట్స్, యాపిల్ కార్‌ప్లే, 90-డిగ్రీల ఓపెన్ డోర్స్ సహా ఇంకా అత్యాధునిక ఫీచర్లు ఇందులో పొందుపరిచినట్టు కంపెనీ వివరించింది. ఈ కారు మొత్తం ప్యూర్, అడ్వెంచర్, అకంప్లిష్‌డ్, క్రియేటివ్ వంటి నాలుగు వేరియంట్లలో లభించనుంది. ఇందులో ప్యూర్ వేరియంట్ కేవలం మాన్యూవల్‌లో లభిస్తుంది. మిగిలిన వేరియంట్లు ఆటోమెటిక్‌లోనూ లభిస్తాయి. అడ్వెంచర్ మాన్యూవల్ రూ. 6.39 లక్షలు ఉండగా, అకంప్లిష్‌డ్ మాన్యూవల్ రూ. 7.29 లక్షలు, క్రియేటివ్ మాన్యువల్ రూ. 8.49 లక్షలుగా ఉంది. ఈ మూడు వేరియంట్లలో ఆటోమెటిక్ కావాలంటే అదనంగా రూ. 60,000 ఖర్చు అవుతుంది.

Advertisement

Next Story