Waqf: జేపీసీ పదవీకాలాన్ని పొడిగించాలి.. స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష ఎంపీల లేఖ

by vinod kumar |
Waqf: జేపీసీ పదవీకాలాన్ని పొడిగించాలి.. స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష ఎంపీల లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024పై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) పదవీ కాలాన్ని పొడిగించాలని లోక్ స్పీకర్ ఓం బిర్లాకు (Om Birla) ప్రతిపక్ష ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బిర్లాకు సోమవారం లేఖ రాశారు. ‘వక్ఫ్ సవరణ బిల్లు అనేది ఇప్పటికే ఉన్న నిబంధలనకు అనేక మార్పులు చేయాల్సిన విస్తృతమైన చట్టం. ఈ మార్పులు భారతదేశ జనాభాలోని పెద్ద వర్గాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల దీనిపై నివేదికను రూపొందించడానికి కేవలం మూడు నెలల సమయం సరిపోదు. అంతేగాక సరైన సిఫార్సులు కూడా చేయలేకపోవచ్చు’ అని పేర్కొన్నారు.

ఈ అంశంపై హడావుడిగా నివేదిక ఇవ్వలేమని తెలిపారు. వివిధ ప్రతినిధుల అభిప్రాయాలు సైతం పెండింగ్‌లో ఉన్నాయని కాబట్టి జేపీసీని పొడిగించాలని కోరారు. బిహార్, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కమిటీ ముందు హాజరుకాలేదని గుర్తు చేశారు. ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం లేకుండా కేవలం లాంఛనప్రాయంగా చట్టాన్ని చర్చిస్తే శాసన ప్రక్రియ చట్టబద్ధత దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. 30 మంది ఎంపీల సంతకాలతో కూడిన లేఖను బిర్లాకు పంపారు. వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 చట్టవిరుద్ధంగా ఆక్రమించబడిన ఆస్తులను తిరిగి పొందేందుకు డిజిటలైజేషన్, పారదర్శకత, చట్టపరమైన విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా గణనీయమైన సంస్కరణలను అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

కాగా, వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024ను ఈ ఏడాది ఆగస్టు8న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల నిరసన తెలిపారు. దీంతో బిల్లుపై సంస్కరణలు తీసుకొచ్చేందుకు స్పీకర్ ఓం బిర్లా జేపీసీని ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ప్రభుత్వ అధికారులు, న్యాయ నిపుణులు, వక్ఫ్ బోర్డు సభ్యులు, పలువురు ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు స్వీకరించేందుకు జేపీసీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ కమిటీకి చైర్మన్‌గా బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ (Jagadhambika paul) వ్యవహరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed