సీబీఐ అధికారాలకు సుప్రీం కత్తెర..!

by Anukaran |
సీబీఐ అధికారాలకు సుప్రీం కత్తెర..!
X

దిశ, వెబ్‌డెస్క్: సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్వతంత్ర దర్యాప్తు సంస్థ. వాస్తవానికి సీబీఐ అనేది పూర్తి స్వతంత్రంగా పనిచేస్తుంది. దేశంలోని ఏ వివాదస్పద కేసునైనా సీబీఐతో విచారణ చేయించాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తూ ఉంటుంది. మూడు నాలుగేండ్ల క్రితం వరకు సీబీఐని యావత్ ప్రజానీకమంతా అత్యంత సమర్థవంతమైన సంస్థగానే భావించారు. కానీ గత మూడు నాలుగేండ్లుగా సీబీఐలో జరుగుతున్న పరిణామాలు.. ప్రభుత్వాల తీరుతో సీబీఐపై రోజురోజూకీ ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందనే చెప్పాలి. అందుకు కారణాలు లేకపోలేదు.

కొన్ని ప్రత్యేకమైన కేసులను డీల్ చేసే సీబీఐ అధికారులు సైతం.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొవడమే కాదు కొంతమంది అధికారుల అవినీతి బాగోతం బట్టబయలైన దాఖలాలు లేకపోలేదు. ఏదీఏలా ఉన్నా.. కాస్తో కూస్తో సీబీఐపై ఇప్పటికీ ప్రజల్లో నమ్మకం అనేది ఉంది. అయితే గత కొంతకాలంగా సీబీఐని కేంద్ర ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటుందనే విమర్శలు భారీగా వెల్లువెత్తాయి. సీబీఐని అడ్డుపెట్టుకుని కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాల మీద పెత్తనం చెలాయిస్తోందంటూ ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు బహిరంగంగానే విమర్శించారు.

సీబీఐకి తొలిసారిగా షాకిచ్చిన చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దోస్తి కట్టారు. కానీ ఐదేండ్లు తిరగక ముందే వారి మధ్య విభేదాలు పొడసూపాయి. అప్పటిదాకా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన టీడీపీ-బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా పరిస్థితులు తయారయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం టీడీపీ అధినేత, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇరుకున పెట్టేందుకు సీబీఐని ప్రయోగించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. ఈ క్రమంలో 2018 నవంబరులో ఆంధ్రప్రదేశ్‌లోకి సీబీఐని ఎంటర్ కానివ్వలేదు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అంతర్గత కుమ్ములాటలతో సీబీఐ ప్రతిష్ట మసకబారిందని, మా రాష్ట్రంలోకి సీబీఐ ప్రమేయం అవసరం లేదంటూ చంద్రబాబు కామెంట్స్ చేసి రాజకీయ ప్రకంపనలను సృష్టించారు.

వాస్తవానికి ఢిల్లీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో సీబీఐ తన విశేష అధికారాలను వినియోగించుకోవాలంటే.. తప్పనిసరిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వం తన సమ్మతిని తెలపాల్సి ఉంటుంది. మొదట్లో ఏపీ ప్రభుత్వం సీబీఐ ప్రమేయానికి సమ్మతి ఇచ్చినప్పటికీ 2018 నవంబరులో సమ్మతిని వెనక్కి తీసుకుని అప్పటి సీఎం చంద్రబాబు సంచలనం సృష్టించారు. ఈ వ్యవహారంలో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చేలరేగింది. ఏపీతో పాటు పశ్చిమబెంగాల్, పంజాబ్​, రాజస్థాన్​, మహారాష్ట్ర, ఝార్ఖండ్​, ఛత్తీస్​గడ్​ వంటి రాష్ట్రాలు సీబీఐ తమ రాష్ట్రంలోకి రాకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టారు.

సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

ఇదిలావుంటే.. తాజాగా సీబీఐ విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చిందనే చెప్పాలి. కేంద్ర దర్యాప్తు సంస్థ ఏదైనా రాష్ట్రంలోకి వెళ్లి దర్యాప్తు చేపట్టాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రాల అనుమతి లేకుండా ఎలాంటి దర్యాప్తు చేపట్టడానికి వీలులేదని తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే తమపై అవినీతి ఆరోపణల కేసులు దర్యాప్తు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు నిందితులు, ప్రైవేటు, ప్రభుత్వ​ ఉద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్​ ఖాన్విల్కర్​, జస్టిస్​ బీఆర్​ గవాయ్​ల ధర్మాసనం.. దిల్లీ ప్రత్యేక పోలీసు ఏర్పాటు చట్టం (డీఎస్​పీఈ)లోని సెక్షన్​ 5, 6ను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో చాలామంది రాజకీయ నేతలు, ప్రముఖులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట లభించినట్టయ్యింది. ప్రధానంగా రాజకీయ కక్ష సాధింపు, రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వ పెత్తనం వంటి విషయాల్లో ఈ తీర్పు కీలకంగా మారనుంది. ఇప్పటికే రాష్ట్రాల అనుమతి లేకుండా సీబీఐ చేపట్టిన అవినీతి, ఆరోపణల కేసులకు సంబంధించి జైళ్లలో మగ్గుతున్న ఎంతోమంది సుప్రీం కోర్టు తీర్పు పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తుండడం గమనార్హం.

Advertisement

Next Story