విచారణకు తొందరేముంది..? తెలంగాణ పిటిషన్‌పై ‘సుప్రీం’ సీజే వ్యాఖ్యలు

by Shyam |   ( Updated:2021-10-08 12:04:40.0  )
విచారణకు తొందరేముంది..? తెలంగాణ పిటిషన్‌పై ‘సుప్రీం’ సీజే వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలోని గడ్డి అన్నారం మార్కెట్ తరలింపు వ్యవహారం చివరకు సుప్రీంకోర్టుకు చేరుకున్నది. ఈ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నందున పండ్ల మార్కెట్‌ను ఇక్కడి నుంచి తొలగించి బాటసింగారం ప్రాంతానికి మార్చాలనుకుంటున్నది. కానీ కొద్దిమంది వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ నిర్ణయం అమలుకు ఈ నెల 18వ తేదీ వరకు మధ్యంతర స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. ఈ పిటిషన్‌ను అత్యవసరమైనదిగా భావించి వెంటనే విచారణకు స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. కానీ ఎమర్జెన్సీ పిటిషన్‌గా భావించి వెంటనే విచారించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దసరా సెలవుల తర్వాత చూద్దామని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనయర్ న్యాయవాది వైద్యనాధన్ వాదిస్తూ, ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నందున పండ్ల మార్కెట్‌ను తరలించాల్సి వస్తున్నదని, కొత్త ప్రాంతంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లనూ చేసిందని, కానీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ కారణంగా ఈ నెల 18వ తేదీ వరకు స్టే ఇచ్చిందని, వీలైనంత తొందరగా తరలింపు పూర్తికావాల్సి ఉన్నందున అత్యవసర పిటిషన్‌గా పరిగణించి విచారణ చేపట్టాలని కోరారు. కానీ ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాత్రం పిటిషన్ అంత అత్యవసరమనదేమీ కాదని, దసరా సెలవుల తర్వాత విచారించవచ్చని పేర్కొని అప్పటికి విచారణకు వచ్చేలా క్యాలెండర్‌లో చేర్చాల్సిందిగా రిజిస్ట్రీ విభాగానికి సూచించారు.

Advertisement

Next Story