ఖరీఫ్ పంటకు మద్దతు ధర పెంపు..

by Shamantha N |   ( Updated:2021-06-09 05:50:02.0  )
ఖరీఫ్ పంటకు మద్దతు ధర పెంపు..
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. ఖరీఫ్ పంటకు మద్దతు ధర పెంచాలన్న ప్రతిపాదనను కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. వరి పంటకు మద్దతు ధరను 1940కి పెంచడానికి సమ్మతించింది. ప్రస్తుతం ఈ ధర క్వింటల్‌కు రూ. 1,868గా ఉన్నది. వరిపంట సహా జొన్నలు, పప్పులు, తృణధాన్యాలకు మద్దతు పెంచినట్టు కేంద్ర ప్రసారాలు, సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ మీడియాకు వెల్లడించారు. నువ్వులకు అధిక ధర పెంపునకు కేంద్రం నిర్ణయించింది. గతేడాదితో పోల్చితే క్వింటాల్‌ నువ్వులకు రూ. 452 పెంచింది. కంది, మినుములకు క్వింటాల్‌కు ధరపై రూ. 300 పెంచింది.

మద్దతు ధరపై సందేహాలు వీడండి

కనీస మద్దతు ధరపై సందేహాలు వీడాలను, తప్పుడు అభిప్రాయాలను విడనాడాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు. మద్దతు ధర ఎప్పటిలాగే కొనసాగుతుందని, కొనసాగడమే కాదని, కేంద్ర ప్రభుత్వమూ ధరలనూ పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటున్నదని వివరించారు. మూడు కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ధర్నాలు చేస్తున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. రైతులతో కేంద్రం పలుమార్లు చర్చలు జరిపింది. కానీ, ఉభయులూ వారి వారి పరిమితులకే కట్టుబడి ఉండటంతో ఫలితాలు ఇవ్వలేకపోయాయి. తాజాగా, మద్దతు ధరను ఎప్పటిలాగే కొనసాగిస్తామని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించడంతోపాటు రైతులతో చర్చలకూ సిద్ధమని ప్రకటించారు. రైతులు ఏదైనా సలహాలు, సూచనలతో ముందుకొస్తే తాము చర్చించడానికి రెడీ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed