పరీక్షలు లేకుండానే.. విద్యార్థులంతా పాస్

by Shamantha N |
పరీక్షలు లేకుండానే.. విద్యార్థులంతా పాస్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా వల్ల విద్యార్థులకు.. పరీక్షలు నిర్వహించుకుండానే వారిని ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఈ ఏడాది కూడా పరీక్షలను రద్దుచేసింది. అసెంబ్లీ వేదికగా తమిళనాడు సీఎం పళనిస్వామి.. 9, 10, 11వ తరగతుల విద్యార్థులకు పరీక్షలు లేకుండా పాస్ చేస్తామని ప్రకటించారు. తాజాగా, పుదుచ్చేరిలోనూ 1 నుండి 9వ తరగతి వరకూ విద్యార్థులకు పరీక్షలు లేకుండా పాస్ చేస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వెల్లడించారు. కోవిడ్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో 9వ తరగతి వరకు పరీక్షలను రద్దుచేస్తున్నట్టు తెలిపారు. అయితే, 10, 11, 12వ తరగతుల విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలుంటాయని తమిళసై వివరించారు.

పాఠశాలల పునఃప్రారంభం, పరీక్షల నిర్వహణకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చేసిన ప్రతిపాదనలను గవర్నర్ ఆమోదించారు. ఈ మేరకు రాజ్‌నివాస్ ఓ ప్రకటనలో తెలిపింది. పుదుచ్చేరి పరిధిలోకి వచ్చే కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని మహే, యానాం విద్యార్థులకు ఇవి వర్తిస్తాయని పేర్కొంది. ఇదే సమయంలో వారానికి ఐదు రోజులు పాఠశాలలను నిర్వహించాలి. 9వ తరగతి వరకు పాఠశాలలు.. మార్చి 31వ తేదీ వరకు పనిచేయనున్నట్టు వివరించింది. ఏప్రిల్ 1 నుంచి వేసవి సెలవులు ఉంటాయని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed