దళిత బస్తీలో స్ట్రీట్ ఫైట్..!

by Aamani |   ( Updated:2023-05-19 11:37:35.0  )
దళిత బస్తీలో స్ట్రీట్ ఫైట్..!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్:

భూమిలేని నిరుపేద ఎస్సీ లకు ప్రభుత్వం జీవనోపాధి కోసం మంజూరు చేస్తున్న దళితబస్తీ భూముల పంపిణీ పథకంలో రాజకీయ దళారుల ప్రమేయం గొడవలకు దారి తీసింది. గ్రామంలో అందరూ చూస్తుండగానే ఇరువర్గాలు కొట్టుకున్నాయి. రెండు రోజుల క్రితమే జరిగిన ఈ సంఘటనను మీడియాకు పొక్కకుండా అక్కడి పొలిటీషియన్లు జాగ్రత్త పడ్డారు. ఈ వ్యవహారం ఆ నోటా ఈ నోటా పడి సర్వత్రా చర్చనీయాంశం అవుతుండడంతో పాటు, అనేక ఆరోపణలకు తావు ఇస్తోంది. లబ్ధిదారుల నుంచి కొందరు వ్యక్తులు భూముల కేటాయింపు కోసం డబ్బులు కూడా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామంలో దళిత బస్తీ కింద 18 మంది లబ్ధిదారులను గుర్తించాల్సి ఉంది. ఈ మేరకు 36 ఎకరాలు భూమిని పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేశారు. భూ పంపిణీ చేసే ముందు గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ వ్యవహారమే ఎస్సీ ల నడుమ గొడవలకు దారి తీసింది. గ్రామస్థాయిలో ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధులు తమకు సన్నిహితంగా ఉండే వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసలైన లబ్ధిదారులను పక్కనపెట్టి నిబంధనలకు విరుద్ధంగా లబ్ధిదారుల ఎంపిక కోసం రాజకీయ ప్రయత్నాలు మొదలవుతున్నాయి. అది కాస్తా దశాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్న కుటుంబాల్లో గొడవకు దారి తీయడం చూస్తే రాజకీయాలు పల్లెలను ఏ స్థాయిలో నాశనం చేస్తున్నాయో అర్థం అవుతోంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ప్రజాప్రతినిధుల జోక్యం లేకుండా చూడాలని జిల్లా దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే జిల్లా సీనియర్ అధికారి సమక్షంలో గ్రామ సభ నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి దళిత బస్తీ పథకానికి మార్గదర్శకంగా నిలవాలని కోరుతున్నారు. లేదంటే భూమి ఉన్నవారికి మళ్లీ భూమి దక్కడం.. అర్హులైన దళితులు అన్యాయానికి గురవడం తప్పదు.

Advertisement

Next Story