స్టీవ్ జాబ్స్ సంతకానికి భారీ రేటు

by Harish |
స్టీవ్ జాబ్స్ సంతకానికి భారీ రేటు
X

ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌‌కు సంబంధించిన వస్తువులను అభిమానులు ఎగబడి కొంటారు. గతంలో స్టీవ్ జాబ్స్ ఉపయోగించిన ఎన్నో వస్తువులు వేలంలో భారీ రేటు పలికాయి. ఇప్పుడు కొత్తగా స్టీవ్ జాబ్స్ సంతకం చేసిన ఫార్చూన్ మేగజైన్ కూడా ఆ కోవలో చేరింది. ‘నేట్ డీ శాండర్స్’ వెబ్‌సైట్ నిర్వహించిన ఈ వేలంలో స్టీవ్ సంతకం చేసిన మేగజైన్‌ను 11 వేల డాలర్లకు వేలం ప్రారంభించగా.. అది 16 వేల డాలర్లకు అమ్ముడు పోయింది. ఈ మేగజైన్ మీద స్టీవ్ జాబ్స్ సంతకం చేయడానికి వెనకున్న రహస్యాన్ని నేట్ డీ శాండర్స్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఈ రహస్యం కారణంగా ఈ మేగజైన్‌కు పెద్ద మొత్తంలో ధర పలికిందని కంపెనీ అభిప్రాయపడింది.

1989 అక్టోబర్ 9 నాటి ఈ ఫార్చూన్ మేగజైన్ కవర్ ఫొటో మీద స్టీవ్ జాబ్స్ ఫొటో ప్రచురించారు. స్టీవ్ జాబ్స్ తన కంపెనీ నెక్స్ట్‌ని ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులకే ఈ మేగజైన్ విడుదలైంది. దీని మీద స్టీవ్ ‘టు టెర్రీ’ అని రాసిచ్చాడు. ఇంతకీ టెర్రీ ఎవరంటే.. కొన్నేళ్ల పాటు స్టీవ్ దగ్గర పనిచేసిన డ్రైవర్. గతంలో స్టీవ్ జాబ్స్ సంతకం చేసిన టాయ్ స్టోరీ పోస్టర్ 31,250 డాలర్ల ధర పలకగా, ఆపిల్ కంప్యూటర్ లోగో 20,000ల డాలర్లకు వేలం అమ్ముడుపోయింది. ఇక స్టీవ్ తయారు చేసిన మొదటి ఆపిల్ కంప్యూటర్ ఏకంగా 4,00,000 డాలర్లు పలికింది.

Advertisement

Next Story