ఒకే దేశం.. ఒకే రేషన్.. ఒకే వేతనం

by Shamantha N |
ఒకే దేశం.. ఒకే రేషన్.. ఒకే వేతనం
X

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నుంచి విడతల వారీగా ప్రకటిస్తున్నారు. మొదటి రోజు ప్రకటనలో చిన్న పరిశ్రమలను ఆదుకోవడం, చిరు ఉద్యోగులకు పీఎఫ్ చెల్లింపులు, బకాయిలు తీర్చేందుకు డిస్కంలకు తోడ్పాటు, వృత్తి నిపుణులకు ఆదాయపన్నులో వెసులుబాటు తదితర వాటితో రూ.6 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. గురువారం రెండో విడత ప్రకటనలో వలస కూలీలు, చిన్న రైతులు, ముద్ర యోజన, హౌసింగ్, వీధి వ్యాపారులు, గిరిజనులకు ఉద్యోగ కల్పన వంటి అంశాలపై ప్యాకేజీలో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయ రుణాల చెల్లింపు మూడు నెలల మరిటోయం విధించారు. దేశంలో ఎక్కడి నుంచి అయినా రేషన్ పొందేందుకు వన్ నేషన్ వన్ రేషన్ స్కీమ్ తెస్తున్నట్లు చెప్పారు. దేశంలోని కార్మికులందరికీ ఒకే వేతనం అమలులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. 2.5 కోట్ల కొత్తగా కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామని, త్వరలో రూ. 25 వేల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఒకే దేశం ఒకే కార్డు

రేషన్‌ కార్డులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఒక్కో కార్డుపై కిలో పప్పు పంపిణీ జరుగుతోంది. రేషన్‌కార్డు లేనివారు కూడా బియ్యం లేదా గోధుమలు, పప్పు పొందవచ్చు. వలస కార్మికులు ఎక్కడ నివసిస్తున్నా, వారికి కార్డు లేకపోయినా ఉచితంగా ఆహార ధాన్యాలు పొందే వీలు కల్పించనున్నారు. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. అంతేకాకుండా రేషన్‌కార్డు పోర్టబిలిటీ తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది. ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’(ఒకే దేశం – ఒకే కార్డు ) విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. దీనిద్వారా రేషన్‌ కార్డు ఉన్నవారు దేశంలో ఎక్కడున్నా రేషన్‌ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆగస్టు నాటికి ఒకే దేశం – ఒకే కార్డు అమలులోకి తీసుకురానున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం 63 కోట్ల మందికి ఈ కార్డు వెసులుబాటు ఉందన్నారు. ఈ విధానం వల్ల 23 రాష్ట్రాల్లోని 67 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం ఉండనుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఉన్న 83 శాతం మందికి ఇది ప్రత్యక్షంగా ఉపయోగపడుతుందని చెప్పారు.

దేశమంతా ఒకే కనీస వేతనం

వలస కార్మికులు తామున్న చోటే కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఉపాధి పొందవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం కనీస వేతనం 30 శాతం మందికే అందుతోంది. దీన్ని సార్వజనీనం చేయనున్నారు. దేశమంతా ఒకే కనీస వేతనం ఉండనుంది. అలాగే, వలస కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వలస కార్మికులందరూ ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా తీసుకునేలా వెసులుబాటు కల్పించనున్నారు. సంస్థలు, కంపెనీలు నేరుగా కార్మికులను నియమించుకునే వెసులుబాటు ఇవ్వనున్నారు. 10 మందికి దాటి ఉపాధి కల్పించే సంస్థలన్నింటికీ ఈఎస్‌ఐ సౌకర్యం ఇవ్వనున్నారు. ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్న నైపుణ్యం పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద రాష్ట్రాలకు రూ. 1,10,002 కోట్లు ఇప్పటికే అందించామని మంత్రి వివరించారు.

కిసాన్‌‌కార్డు ఉన్నవారికి రూ.25 వేల కోట్లు

వ్యవసాయ రుణాలపై మూడు నెలలపాటు మారటోరియం విధిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగిస్తున్నామన్నారు. సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించనున్నారు. కిసాన్‌ కార్డుదారులకు రూ.25 వేల కోట్లు రుణాలిస్తామని ప్రకటించారు. గత మూడు నెలల్లో 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామన్నారు. పేదలు, వలస కార్మికులు, రైతుల కోసం నైన్ పాయింట్ ఫార్ములాను రూపొందించినట్లు తెలిపారు. రబీ కోతలు, ఖరీఫ్‌ ముందస్తు ఏర్పాట్ల నిమిత్తం నిధుల వినియోగిస్తున్నారు. కొత్త నిధులతో 3 కోట్ల మంది రైతులకు అదనపు ప్రయోజనాలు కలగనున్నాయి. చిన్న, సన్నకారు రైతులకు ఇప్పటికే రూ.4 లక్షల కోట్లు ఇచ్చినట్టు ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. నాబార్డు ద్వారా అత్యవసర వర్కింగ్‌ క్యాపిటల్‌ ఫండ్‌ కింద రూ.30 వేల కోట్లు కేటాయించనున్నారు.

మత్స్యకారులకు కూడా కిసాన్‌ క్రెడిట్‌ కార్డు

2.5 కోట్ల మంది రైతులకు కొత్తగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు మంజూరు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. వీరికి రూ. 2 లక్షల కోట్ల అదనపు రుణాలు ఇవ్వనున్నారు. కిసాన్‌ క్రెడిట్‌ లేని రెండున్నర కోట్ల మంది రైతులకు ఈ పథకం వర్తించనుంది. పశుపోషకులు, మత్స్యకారులకూ ఈ కార్డులు ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు.

వలస కార్మికుల కోసం

పట్టణ పేదలు, వలస కూలీలందరికీ భోజన ఏర్పాట్లు చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. సహాయ శిబిరాలు, భోజన ఏర్పాట్లకు రూ. 11 వేల కోట్లు రాష్ట్రాలకు కేటాయించామని, వలస కార్మికులకు నగదు పంపిణీ చేశామని వివరించారు. పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాలకు రూ. 12 వేల కోట్లు ఇప్పటికే ఇచ్చినట్టు స్పష్టం చేశారు. పైసా పోర్టల్‌ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్‌ ఫండ్‌ అందించారు.

తక్కువ అద్దె గృహాల నిర్మాణానికి పథకం

వలస కార్మికులు, పట్టణ పేదల కోసం తక్కువ అద్దె గృహాల నిర్మాణానికి కొత్త పథకం తెస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ గృహాల నిర్మాణం పీపీపీ పద్ధతిలో ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని చేపట్టడానికి కేంద్రం తగిన సాయం అందిస్తుందని, వలస కార్మికులు నివసించడానికి ఇబ్బంది లేకుండా ఈ కొత్త పథకం ఉంటుందన్నారు. ఈ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ప్రవేశపెట్టనున్నారు. భూమి ఉన్నవాళ్లు ముందుకొస్తే తగిన సాయం కోసం కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం వలస కార్మికులకు ఉపాధి కోసం మే 13 నాటికి 13 కోట్ల పని దినాలు కల్పించినట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం రూ. 4,200 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం రాష్ట్రాలకు వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద రూ. 6,700 కోట్లు కేటాయించనున్నారు. ఉపాధి హామీ పథకం కింద రూ. 10 వేల కోట్లు ఇప్పటికే బట్వాడా చేసినట్టు వెల్లడించారు.

వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణం రూ. 10 వేలు

ముద్ర పథకం కింద రూ.50 వేల లోపు తక్కువ రుణాలు తీసుకున్నవారికి వడ్డీ రాయితీ ఇవ్వనున్నారు. మారటోరియం తర్వాత ముద్ర రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. వీధి వ్యాపారులకు రుణ సదుపాయం కల్పించనున్నారు. 50 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.5 వేల కోట్ల రుణ సాయం అందించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద కేంద్రం రుణం మంజూరు చేస్తుంది. ఈ సదుపాయాన్ని నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు మంత్రి ప్రకటించారు. మధ్య ఆదాయ వర్గాలకు గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం మరో ఏడాది పొడిగించనున్నారు. రూ.6 లక్షల నుంచి రూ.18 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది.

అడవుల పరిరక్షణకు క్యాంపా..

అడవుల పరిరక్షణ కోసం, మొక్కలు నాటడం కోసం కొత్త పథకం తీసుకొస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. దీనికోసం రూ. 6 వేల కోట్లతో గిరిజనులకు ఉపాధి కల్పించేలా క్యాంపా పథకం ప్రకటించారు. రాబోయే నెల రోజుల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా గిరిజనులకు నేరుగా నగదు అందుబాటులోకి వస్తుంది. ఈ పథకాన్ని చిన్న పట్టణాల్లో కూడా వినియోగించుకోవచ్చు. పథకాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణపై ఆధారపడి ఉంటుందని ఆర్థికమంత్రి తెలిపారు.

Advertisement

Next Story