కరెంట్ పోల్‌కు కర్ర సాయమా.. ఇంకెన్నాళ్లు..?

by Sridhar Babu |
కరెంట్ పోల్‌కు కర్ర సాయమా.. ఇంకెన్నాళ్లు..?
X

దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల అర్బన్ పరిధిలోని రాజీవ్ నగర్‌లో ఇళ్ల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం ఒక పక్కకు ఒరిగిపోయింది. ప్రస్తుతం దానిని ఓ కర్ర సాయంతో నిలిపారు. అది కాస్త ప్రమాదకరంగా మారి ఆ దారి గుండా వెళ్లే వారికి ముప్పుగా తయారైంది. అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులకు పెను ప్రమాదం పొంచి ఉంది. దీని గురించి ఫిర్యాదు చేసినా విద్యుత్‌ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. వారం రోజుల కిందట జిల్లాలో వీచిన ఈదురుగాలుల ధాటికి రాజీవ్ నగర్‌లోని ఇళ్ల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం ఒరిగిపోయి రహదారి పైన వేలాడుతూ కనిపించింది. వంగిపోయిన స్తంభం స్థానంలో కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ అధికారులు నామమాత్రంగా ఓ చెక్కను సపోర్ట్‌గా పెట్టి చేతులు దులుపుకున్నారు.

కర్ర కొంచెం జరిగినా విద్యుత్‌ స్తంభం ఏ క్షణంలోనైనా పడిపోయే ప్రమాదం ఉంది. ఇళ్ల మధ్యలో స్తంభం ఉండటంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి. అంతేగాకుండా పాదచారులు నిత్యం ఆ రహదారిపై ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉంటారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన గురవుతున్నారు. దానికి వెంటనే మరమ్మత్తులు చేయాలని వారం రోజులుగా విద్యుత్‌ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే చర్యలు చేపట్టి ప్రమాదం జరగకుండా చూడాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed