ఐపీఎల్‌లో లక్నో జట్టు దొంగాట.. బీసీసీఐకి ఫిర్యాదు

by Shyam |
ఐపీఎల్‌లో లక్నో జట్టు దొంగాట.. బీసీసీఐకి ఫిర్యాదు
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2022 రిటెన్షన్ మంగళవారం మధ్యాహ్నం 12.00 గంటలకు పూర్తవుతాయి. ఏయే జట్లలో ఎవరు రిటైన్ చేయబడ్డారో బీసీసీఐ రేపు రాత్రి ప్రకటించనున్నది. దీని తర్వాత డిసెంబర్ 1 నుంచి కొత్త జట్లకు ఫ్రీ పికప్ ఆప్షన్ లభిస్తుంది. అయితే కొత్తగా లక్నో జట్టును కొనుగోలు చేసిన ఆర్పీ సంజీవ్ గోయాంక గ్రూప్ దొంగాట ఆడుతున్నదని పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు బీసీసీఐకి ఫిర్యాదు చేశాయి. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, సన్‌రైజర్స్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్‌లను ప్రలోభాలకు గురి చేస్తూ ఫ్రాంచైజీలను వదిలి లక్నో జట్టుకు వచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నాయని వారు ఫిర్యాదు చేశారు.

తాము రిటైన్ చేసుకోవాలనుకున్న ఆటగాళ్లకు నిబంధనలకు విరుద్దంగా ముందే సంప్రదించి వారికి భారీ డబ్బును శాలరీగా ఆశ చూపుతున్నదని.. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్దమని సదరు ఫ్రాంచైజీలు ఫిర్యాదు చేశాయి. కాగా, ఈ రెండు జట్లు లిఖిత పూర్వకంగా కాకుండా మాట ద్వారా ఫిర్యాదు చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. వారి ఫిర్యాదును అందుకున్నామని.. బీసీసీఐ దీనిపై విచారణ చేపట్టిందని ఆయన చెప్పారు. ఒక వేళ లక్నో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినట్లు తేలితే చర్య తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed