IPL 2025 : లక్నో మెంటార్‌గా జహీర్ ఖాన్.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ఫ్రాంచైజీ

by Harish |   ( Updated:2024-08-28 11:49:25.0  )
IPL 2025 : లక్నో మెంటార్‌గా జహీర్ ఖాన్.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ఫ్రాంచైజీ
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. జహీర్ నియామకాన్ని లక్నో ఫ్రాంచైజీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. గతేడాది సీజన్ తర్వాత గౌతమ్ గంభీర్ నిష్ర్కమణతో లక్నో మెంటార్ స్థానం ఖాళీగా ఉంది. గత రెండు సీజన్లలో గంభీర్ మార్గదర్శకత్వంలో ప్లే ఆఫ్స్‌కు చేరిన లక్నో.. ఈ ఏడాది పేలవ ప్రదర్శన చేసింది. 7వ స్థానంతో సరిపెట్టింది.

ఈ నేపథ్యంలో సమర్థవంతమైన మెంటార్‌గా కోసం వెతికిన ఫ్రాంచైజీ.. ఆ రోల్‌కు అనుభవజ్ఞుడైన జహీర్ ఖాన్‌ను నియమించింది. జహీర్ బౌలింగ్ కోచ్‌గా కూడా వ్యవహరించనున్నాడు. ‘లక్నో మూడు సీజన్లలో రెండు సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఇది నాకు ప్రత్యేకమైన ప్రయాణం అవుతుంది. లక్నోలో చాలా మ్యాచ్‌లు ఆడాం. చాలా సమయం గడిపాం. త్వరలోనే లక్నోకు వస్తాం.’ అని జహీర్ ఖాన్ తెలిపాడు.

45 ఏళ్ల జహీర్ 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 610 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. అలాగే, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన అతను 100 మ్యాచ్‌ల్లో 102 వికెట్లు తీసుకున్నాడు. అనుభవజ్ఞుడైన జహీర్ ఖాన్ మెంటార్‌గానే కాకుండా బౌలింగ్ కోచ్‌గా ఉండటం లక్నో బౌలింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచడంలో సహాయపడుతుంది.

Advertisement

Next Story

Most Viewed