సచిన్‌ను మోయడమా.. మా వల్ల కాదన్నాం : Virender Sehwag

by Vinod kumar |
సచిన్‌ను మోయడమా.. మా వల్ల కాదన్నాం : Virender Sehwag
X

దిశ, వెబ్‌డెస్క్: 2011 వన్డే ప్రపంచకప్ విజయానంతరం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను మోయడం తమ వల్ల కాదని చెప్పామని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఈ ఏడాది చివర్లో భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించగా.. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న సెహ్వాగ్.. 2011 ప్రపంచకప్ నాటి క్షణాలను గుర్తుచేసుకున్నారు. భారత్‌ విజేతగా నిలిచిన వెంటనే.. మైదానంలో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయని, జట్టులోని యువ ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్‌ను భుజాలపై ఎత్తుకొని మైదానం మొత్తం తిరిగారని తెలిపాడు. సచిన్ ఎత్తుకునే పనిని యువ ఆటగాళ్లకు అప్పగించామని గుర్తు చేసుకున్నాడు.

'సచిన్‌ చాలా బరువు ఉంటాడు. మేం ముసలోళ్లం.. మాకు భుజాల నొప్పులున్నాయి.. ధోనీకి మొకాలి గాయం ఉంది. మరికొందరు ఆటగాళ్లకు ఇతర ఫిట్‌నెస్ సమస్యలున్నాయి. అందుకే.. సచిన్‌ను మోసే పనిని యువ ఆటగాళ్లకు వదిలేశాం. మీరెళ్లి సచిన్‌ను ఎత్తుకొని మైదానంలో రౌండ్‌ కొట్టి రండి అని చెప్పాం. అందుకే విరాట్‌ కోహ్లీ సచిన్‌ను తన భుజాలపై మోశాడు'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. భారత్ వేదికగా జరగనున్న ఈ వన్డే ప్రపంచకప్‌ 2023లో విజేతగా నిలవడానికి రోహిత్ సేనకు మంచి అవకాశమని.. ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా తలపడే అవకాశం ఉందని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. అత్యధిక పరుగుల జాబితాలో విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ ఉండే అవకాశం ఉందన్న సెహ్వాగ్.. వికెట్ల జాబితాలో జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ షమీ ఉండే అవకాశం ఉందన్నాడు.

Advertisement

Next Story

Most Viewed