భారత నం.1 టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా తెలుగమ్మాయి శ్రీజ

by Dishanational3 |
భారత నం.1 టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా తెలుగమ్మాయి శ్రీజ
X

దిశ, స్పోర్ట్స్ : టేబుల్ టెన్నిస్‌లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ భారత నం.1 క్రీడాకారిణిగా అవతరించింది. మహిళల సింగిల్స్‌లో స్టార్ క్రీడాకారిణి మనికా బాత్రాను వెనక్కినెట్టి అగ్రస్థానం దక్కించుకుంది. మంగళవారం విడుదలైన ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్(ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో శ్రీజ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించింది. ఒక్క స్థానాన్ని అధిగమించి 38వ ర్యాంక్‌కు చేరుకుంది. దీంతో మహిళల సింగిల్స్‌లో భారత్ తరపున టాప్ ర్యాంక్ పొందడంతోపాటు దేశంలో నం.1 ర్యాంక్‌కు దూసుకెళ్లింది.

మరోవైపు, మనికా రెండు స్థానాలు కోల్పోయి 39వ స్థానానికి పడిపోయింది. ఈ సీజన్‌లో శ్రీజ అద్భుత ప్రదర్శన చేస్తున్నది. జనవరిలో డబ్ల్యూటీటీ ఫీడర్ కార్పస్ క్రిస్టీ, గత నెలలో డబ్ల్యూటీటీ ఫీడర్ బీరూట్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌-2022లో శరత్ కమల్‌తో కలిసి శ్రీజ మిక్స్‌డ్ డబుల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఐటీటీఎఫ్ పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో శరత్ కమల్ భారత్ తరపున టాప్ ర్యాంక్ 37వ స్థానంలో కొనసాగుతున్నాడు. సత్యన్ జ్ఞానేశ్వరన్, మానవ్ థాకర్ వరుసగా 60, 61 స్థానాల్లో ఉండగా.. నేషనల్ చాంపియన్ హర్మీత్ దేశాయ్ 64వ ర్యాంక్‌లో ఉన్నాడు.



Next Story

Most Viewed