క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత క్రికెటర్

by Harish |
క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్పిన్నర్ షాబాజ్ నదీమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌‌తోపాటు దేశవాళీ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపాడు. టీ20 లీగ్స్‌పై దృష్టిపెట్టనున్నట్టు చెప్పాడు. ‘చాలా కాలంగా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా. మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. టీమ్ ఇండియా తరపున ఆడాలనే ప్రేరణ మీకుంటే ఎల్లప్పుడు మంచి ప్రదర్శన చేస్తారని నేను భావిస్తా. భారత జట్టులో నాకు అవకాశాలు రాకపోవచ్చని నాకు అర్థమైంది. కాబట్టి, యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం మంచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌ల్లో ఆడటంపై ఫోకస్ పెట్టాను.’ అని షాబాజ్ నదీమ్ తెలిపాడు.

కాగా, జార్ఖండ్‌కు చెందిన షాబాజ్‌కు టీమ్ ఇండియా తరపున ఎక్కువగా అవకాశాలు దక్కలేదు. కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన అతను 8 వికెట్లు పడగొట్టాడు. 2019లో సౌతాఫ్రికాపై టెస్టు అరంగేట్రం చేసిన అతను.. 2021లో ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు ఆడాడు. దేశవాళీలో 140 ఫస్ట్ క్లాస్ క్రికెట్, 134 లిస్ట్ ఏ, 150 టీ20 మ్యాచ్‌ల్లో కలిపి మొత్తం 842 వికెట్లు తీసుకున్నాడు. గత నెలలో రంజీ ట్రోఫీలో రాజస్థాన్‌తో చివరి మ్యాచ్ ఆడిన అతను 3 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Next Story