తొలి టెస్టులో పాక్‌పై విజయం.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకెళ్లిన సౌతాఫ్రికా

by Harish |
తొలి టెస్టులో పాక్‌పై విజయం.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకెళ్లిన సౌతాఫ్రికా
X

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో సౌతాఫ్రికా ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి టెస్టులో పాక్‌పై నెగ్గడంతో నేరుగా ఫైనల్ బెర్త్ దక్కింది. డబ్ల్యూటీసీ చరిత్రలో దక్షిణాఫ్రికా ఫైనల్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. సెంచూరియన్ వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు 8 వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఓవర్‌నైట్ స్కోరు 27/3తో నాలుగో రోజు ఛేదనను కొనసాగించిన సౌతాఫ్రికా మరో ఐదు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. 8 వికెట్లు కోల్పోయి 150 స్కోరు చేసింది. ఛేదనలో సౌతాఫ్రికా తడబడటంతో మ్యాచ్ ఆసక్తికరంగానే సాగింది. అయితే, కెప్టెన్ బావుమా(40), మార్‌క్రమ్(37) జట్టును గాడిలో పెట్టగా.. రబాడా(31 నాటౌట్) అద్భుతమైన పోరాటంతో జట్టును గెలిపించాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో 66.67 శాతంతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుని ఫైనల్‌కు అర్హత సాధించింది. మరో ఫైనల్ బెర్త్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా పోటీపడుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ 11న లార్డ్స్ స్టేడియంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.

Advertisement

Next Story