శ్రీలంక క్రికెట్‌లో ఒకే ఒక్కడు.. వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన నిస్సాంక

by Harish |
శ్రీలంక క్రికెట్‌లో ఒకే ఒక్కడు.. వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన నిస్సాంక
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక ఓపెనర్ పాథుమ్ నిస్సాంక సంచలనం సృష్టించాడు. వన్డే డబుల్ సెంచరీ సాధించిన తొలి శ్రీలంక క్రికెటర్‌గా ఘనత సాధించాడు ఆఫ్ఘనిస్తాన్‌పై తొలి వన్డేలో అతను ఈ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఏ శ్రీలంక బ్యాటర్ వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించలేదు. అర్జున రణతుంగ, సనత్‌ జయసూర్య, కుమార సంగక్కర, మహేళ జయవర్దెనే వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాలేదు. టీమ్ ఇండియాపై 2000లో సనత్ జయసూర్య చేసిన 189 పరుగులే శ్రీలంక వన్డే క్రికెట్‌లో హయ్యెస్ట్ స్కోరు. 24 ఏళ్ల తర్వాత సనత్ జయసూర్య రికార్డును నిస్సాంక బద్దలుకొట్టడమే కాకుండా శ్రీలంక క్రికెట్‌లో సొంతగడ్డపై కొత్త చరిత్రను లిఖించాడు.

ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి వన్డేలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 381 పరుగులు చేసింది. శ్రీలంక భారీ స్కోరు చేయడానికి కారణం నిస్సాంక. ఓపెనర్‌గా వచ్చిన నిస్సాంక చివరి వరకూ అజేయంగా నిలిచాడు. 139 బంతుల్లో 20 ఫోర్లు, 8 సిక్స్‌లతో 210 పరుగులు చేశాడు. 88 బంతుల్లో సెంచరీ చేసిన అతను.. మరో 48 బంతుల్లోనే ద్విశతకం అందుకున్నాడు. 136 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో వన్డేల్లో వేగంగా డబుల్ సెంచరీ చేసిన మూడో క్రికెటర్‌గా నిస్సాంక నిలిచాడు. తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్(138 బంతులు), భారత దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(140)లను వెనక్కినెట్టాడు. ఈ జాబితాలో టీమ్ ఇండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ 126 బంతులతో అగ్రస్థానంలో ఉండగా.. ఆసిస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 128 బంతులతో రెండో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Next Story