సెమీస్‌లో సింధు ఓటమి.. ఫైనల్‌కు ప్రణయ్

by Mahesh |
సెమీస్‌లో సింధు ఓటమి.. ఫైనల్‌కు ప్రణయ్
X

కౌలాలంపూర్ : భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్స్ మెడలిస్ట్ పీవీ సింధుకు ఈ ఏడాదిలో తొలి టైటిల్ ఎదురుచూపులు తప్పడం లేదు.గత నెలలో స్పెయిన్ మాస్టర్స్‌లో ఫైనల్‌‌కు చేరుకున్నప్పటికీ తుది పోరులో పరాజయం పాలైంది. తాజాగా మలేషియా మాస్టర్స్‌లోనూ సింధుకు నిరాశే ఎదురైంది. ఈ టోర్నీలో ఆరంభం నుంచి సత్తాచాటిన ఆమె సెమీస్‌లో ఓడిపోయింది. శనివారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో సింధుపై 14-21, 17-21 తేడాతోఇండోనేషియా క్రీడాకారిణి జార్జియా మరిస్క టున్‌జుంగ్‌ విజయం సాధించింది. అయితే, తొలి గేమ్‌లో మొదట సింధు ఆధిపత్యమే కొనసాగింది. కానీ, క్రమంగా ఆట ప్రత్యర్థి చేతుల్లోకి వెళ్లింది. ఇండోనేషియా ప్లేయర్ 12-12తో స్కోరును సమం చేసి సింధు లీడ్‌కు బ్రేక్ వేసింది. ఆ తర్వాత సింధు వరుసగా పాయింట్స్‌ను కోల్పోయింది.

ఇక, రెండో గేమ్‌లో సింధు గట్టిగానే పోరాడింది. 4-1తో గేమ్‌ను సానుకూలంగానే ప్రారంభించింది. అయితే, 5-5తో స్కోరు సమమైన తర్వాత టున్‌జింగ్ లీడ్‌లోకి వెళ్లగా.. సింధు ప్రత్యర్థిని అడ్డుకునేందుకు కాసేపు పోరాడింది. అయినా ఫలితం దక్కలేదు. రెండు గేమ్‌ల్లోనూ మంచి పొజిషన్‌లో ఉన్న సమయంలో ఆమె చేసిన పలు తప్పిదాలు కొంపముంచడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. మెన్స్ సింగిల్స్‌లో భారత స్టార్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీస్‌లో ఇండోనేషియా ఆటగాడు క్రిస్టియన్ ఆదినాటా గాయం కారణంగా ఆట నుంచి తప్పుకోవడంతో ప్రణయ్ నేరుగా ఫైనల్‌లో అడుగుపెట్టాడు. క్రిస్టియన్ వైదొలగే సమయానికి తొలి గేమ్‌లో ప్రణయ్ 19-17తో లీడ్‌లో కొనసాగుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed