రోహిత్‌ శర్మకు రెస్ట్.. విండీస్ టూరు మొత్తానికి దూరం..!

by Vinod kumar |
రోహిత్‌ శర్మకు రెస్ట్.. విండీస్ టూరు మొత్తానికి దూరం..!
X

న్యూఢిల్లీ : వెస్టిండీస్‌తో మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో భాగంగా వచ్చే నెలలో టీమ్ ఇండియా కరేబియన్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌కు బీసీసీఐ ఇంకా భారత జట్టును ఎంపిక చేయలేదు. ఈ నెల చివర్లో టీమ్‌ను ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఈ టూరు మొత్తానికి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న అతనికి విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్టు సమాచారం. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో టీమ్ ఇండియా ఓటమి చెందడంతో కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. వరుసగా ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్.. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు వైఫ్యలానికి మొదటి బాధ్యుడిని చేస్తూ అతనిపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్నది. మరోవైపు, రోహిత్ ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు.

ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ అతను గొప్ప ప్రదర్శన చేయలేదు. దాంతో విండీస్ పర్యటనలో అతనికి విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్టు భావిస్తున్నారని తెలుస్తోంది. ‘ఐపీఎల్‌, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రోహిత్ జోష్‌గా కనిపించలేదు. అందుకే వెస్టిండీస్ టూర్‌లో కొంత భాగమైనా అతను విశ్రాంతి తీసుకోవాలని సెలెక్టర్లు అనుకుంటున్నారు. రోహిత్‌ను సంప్రదించిన తర్వాతే సెలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా, కరేబియన్ పర్యటన జూలై 12 నుంచి మొదలు కానుంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో విండీస్‌తో టీమ్ ఇండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అలాగే, విండీస్‌తో టెస్టు సిరీస్‌తో భారత్ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సర్కిల్‌ను ప్రారంభించనుంది.

ఫామ్‌లేమితో రోహిత్ సతమతం..

హిట్‌మ్యాన్‌లో ముందున్న దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు. టెస్టుల్లో చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ మినహా చెప్పకోదగ్గ ప్రదర్శన చేయలేదు. వన్డేల్లో మాత్రం రోహిత్ సత్తాచాటుతున్నాడు. చివరి 10 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీతోపాటు మూడు అర్ధ సెంచరీలు చేశాడు. అయితే, ఐపీఎల్-16లో అతను దారుణంగా విఫలమయ్యాడు. 16 మ్యాచ్‌ల్లో 20.75 సగటుతో 332 పరుగులు మాత్రమే చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 15, 43 పరుగులు మాత్రమే చేశాడు. కొంతకాలంగా రోహిత్ టీ20లకు దూరంగా ఉంటున్నాడు. టెస్టులు, వన్డేలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో విండీస్‌ టూరుకు అతనికి విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే, టెస్టుల్లో జట్టుకు అజింక్యా రహానే నాయకత్వం వహించే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed