ఆంధ్ర, బెంగాల్ మ్యాచ్ డ్రా

by Swamyn |
ఆంధ్ర, బెంగాల్ మ్యాచ్ డ్రా
X

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో బెంగాల్‌తో తొలి గ్రూపు మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు డ్రా చేసుకుంది. మ్యాచ్‌లో చివరి రోజు కూడా ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 339/6తో మ్యాచ్‌లో సోమవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర జట్టు 445 పరుగులు చేసి ఆలౌటైంది. రికీ భుయ్(175, 347 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్స్) ఓవర్‌నైట్ స్కోరుకు 68 పరుగులు జోడించగా.. షోయబ్ ఖాన్(56) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ జోడీ ఏడో వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. షోయబ్ ఖాన్‌ అవుటవడంతో ఈ జోడీకి తెరపడగా.. డబుల్ సెంచరీ దిశగా వెళ్తున్న రికీ భుయ్ 10 వికెట్‌గా పెవిలియన్ చేరడంతో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ ముగిసింది. బెంగాల్ బౌలర్లలో మహ్మద్ కైప్(3/62) సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర జట్టుకు 36 పరుగుల ఆధిక్యం లభించింది.అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగులు చేసిన విషయం తెలిసిందే. చివరి రెండో లంచ్ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ జట్టు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. శ్రేయాన్ష్ ఘోష్(29), సుదీప్ కుమార్(7) అజేయంగా నిలిచారు. ఓపెనర్ సౌరవ్(30) వికెట్ షోయబ్ ఖాన్‌కు దక్కింది.

రియాన్ పరాగ్ ఫాస్టెస్ట్ సెంచరీ

రంజీ ట్రోఫీలో అసోం కెప్టెన్, ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ ఫాస్టెస్ట్ సెంచరీ బాదాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన తొలి గ్రూపు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో రియాన్ పరాగ్ 56 బంతుల్లో సెంచరీ చేసి టోర్నీ చరిత్రలో సెకండ్ ఫాస్టె్స్ట్ సెంచరీని నెలకొల్పాడు. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరిట ఉంది. 2016లో పంత్ 48 బంతుల్లో శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ 87 బంతుల్లో 11 ఫోర్లు, 12 సిక్స్‌లతో 155 పరుగులు చేశాడు. అయితే, అతని పోరాటం వృథా అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. అసోం నిర్దేశించిన 87 పరుగుల లక్ష్యాన్ని ఛత్తీస్‌గఢ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చత్తీస్‌గఢ్ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేయగా.. అసోం 159 పరుగులకే కుప్పకూలింది. ఫాలో ఆన్ ఆడిన అసోం రెండో ఇన్నింగస్‌లో 254 పరుగులు చేసి ఆలౌటైంది.

Advertisement

Next Story

Most Viewed