ప్రొ కబడ్డీ లీగ్‌ను టైతో ముగించిన టైటాన్స్

by Harish |
ప్రొ కబడ్డీ లీగ్‌ను టైతో ముగించిన టైటాన్స్
X

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసిన తెలుగు టైటాన్స్ టోర్నీని టైతో ముగించింది. ఆఖరి మ్యాచ్‌‌ను యు ముంబాతో టై చేసుకుంది. మంగళవారం హర్యానాలోని పంచుకులలో జరిగిన ఈ మ్యాచ్‌‌లో 45-45తో ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. ఇరు జట్ల ఆటగాళ్లు పాయింట్ల కోసం పోటీపడటంతో మొదటి నుంచి ఆసక్తికరంగా పోరు సాగింది. ఓ సారి ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన టైటాన్స్ ఆధిక్యంలోకి వెళ్లగా యు ముంబా తిరిగి పుంజుకుంది. దీంతో ఫస్టాఫ్ ముగిసే సరికి టైటాన్స్, యు ముంబా 19-19 స్కోరుతో నిలిచాయి. సెకండాఫ్‌ యు ముంబా జోరు పెంచింది. రెండుసార్లు టైటాన్స్‌ను ఆలౌట్ చేసి 44-35తో ఆధిక్యం సాధించి విజయం సాధించేలా కనిపించింది. ఈ పరిస్థితుల్లో పుంజుకున్న టైటాన్స్ ఆధిక్యాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. ఇక, ఆఖరి రైడ్‌లో కెప్టెన్ పవన్ యు ముంబాను ఆలౌట్ చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో టైటాన్స్ తృటిలో ఓటమి నుంచి బయటపడింది. తెలుగు టైటాన్స్ తరపున కెప్టెన్ పవన్ 14 పాయింట్లతో సత్తాచాటగా.. యు ముంబా తరపున అమీర్ 11 పాయింట్లు, గుమన్ సింగ్ 8 పాయింట్లతో రాణించారు. టోర్నీలో తెలుగు టైటాన్స్ 22 మ్యాచ్‌ల్లో కేవలం రెండింట మాత్రమే నెగ్గింది. 19 మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంతో టోర్నీని ముగించింది.

Advertisement

Next Story