Sachin Tendulkar: సచిన్ తొలి సెంచరీకి 33 ఏళ్లు.. ఏ టీమ్‌పై బాదాడో తెలుసా?

by Vinod kumar |   ( Updated:2023-08-20 15:39:22.0  )
Sachin Tendulkar: సచిన్ తొలి సెంచరీకి 33 ఏళ్లు.. ఏ టీమ్‌పై బాదాడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ పేరు చెబితే శతకాలు గుర్తొస్తాయి. టెస్టులు, వన్డేలు కలుపుకొని వంద సెంచరీలు బాదాడు. అలాంటి సచిన్​ తెందూల్కర్ అంతర్జాతీయ మ్యాచ్‌లో తొలి సెంచరీ చేసింది ఆగస్టు 14నే. ఇంగ్లండ్ గడ్డ మీద 1990లో అంటే 17 ఏళ్ల 112 రోజుల వయసులో సరిగ్గా ఇదే రోజు సచిన్ తొలి శతకం బాదాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన టెస్టులో అద్భుతంగా రాణించి, ఓటమి గండం నుంచి భారత జట్టును గట్టెక్కించాడు. దిగ్గజ క్రికెటర్లు తడబడినా.. ఇంగ్లీష్ బౌలర్లకు ఎదురు నిలిచాడు. కాగా.. సచిన్ తొలి సెంచరీ చేసి నేటికి 33 ఏళ్లు.

ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారత్‌కు 408 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. డెవాన్ మెక్‌కల్లమ్, అంగస్ ఫ్రేసర్, ఎడ్డీ హెమ్మింగ్స్ లాంటి బౌలర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తడబడ్డారు. భారత బ్యాటర్​సిద్ధు డకౌట్ కాగా.. రవిశాస్త్రి 12 పరుగులు, సంజయ్ మంజ్రేకర్ 50 రన్స్ చేసిన పెవిలియన్ చేరాడు. వెంగ్‌సర్కార్ కూడా 32 పరుగులకే ఔటయ్యాడు. 109 పరుగులకే నాలుగు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన సచిన్ అద్భుతంగా రాణించాడు. 11 పరుగులు చేసిన కెప్టెన్ అజారుద్దీన్ ఔటైనా.. కపిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. హెమ్మింగ్స్ రిటర్న్ క్యాచ్ వదలడం వల్ల సచిన్‌కు లైఫ్ వచ్చింది. అది మొదలు అతడు వెనుదిరిగి చూడలేదు.. 189 బంతులను ఓపికగా ఎదుర్కొన్న సచిన్ 119 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 67 రన్స్‌తో మనోజ్ ప్రభాకర్ మాస్టర్‌కు అండగా నిలిచాడు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Advertisement

Next Story

Most Viewed