వరంగల్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు..

by Kalyani |
వరంగల్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు..
X

దిశ, వరంగల్‌ టౌన్: ఎన్నాళ్ళకెన్నాళ్ళకు వరంగల్‌ నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణపై ట్రాఫిక్‌ పోలీసుల్లో చలనం కలిగింది. ఉన్నపళంగా వరంగల్‌ జేపీఎన్‌ రోడ్డులో చర్యలకు ఉపక్రమించారు. షాపింగ్‌ మాల్స్‌ కల్చర్‌ వచ్చాక నగరంలో ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతోంది. ఉదయం ఆఫీసులు, కాలేజీల సమయంలో, తిరిగి సాయంత్రం సమయంలో ప్రధాన రహదారుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా వరంగల్‌ చౌరస్తా, ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంతం, బట్టలబజార్‌, పాతబీటు బజారుల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు చాలా ఉంటాయి. షాపుల ముందు వాహనాలు నిలపడంతో పాదచారులు సైతం వెళ్లలేని దుస్థితి ఏర్పడేది. పండుగల వేళ అయితే, కాలు తీసి కాలు వేసే పరిస్థితి కూడా ఉండదు. ఈ పరిస్థితులపై పలుమార్లు ‘దిశ’ దినపత్రిక ప్రత్యేక కథనాలను ప్రచురించింది. ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఎన్నాళ్లకైతేనేమీ మొత్తానికి ట్రాఫిక్‌ పోలీసులు నిద్ర లేచారు. గురువారం వరంగల్‌ జేపీఎన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలకు రంగంలోకి దిగారు. షాపుల ముందు పార్కింగ్‌ కోసం రెడ్‌కలర్‌తో మార్కింగ్‌ చేశారు. వాహనాలను ఆ గీతలోపలే పార్కింగ్‌ చేసుకోవాలని షాపుల నిర్వాహకులను పిలిచి మరీ సూచించారు. ఆ గీత దాటి వాహనాలు బయటకు వస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అయితే, ఈ ఒక్క ప్రాంతంలోనే కాకుండా రద్దీగా ఉండే ఇతర ప్రాంతాల్లోనూ రోడ్ల మీద పార్కింగ్‌ చేయకుండా చర్యలు చేపట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లో పార్కింగ్‌ స్థలాలు వినియోగంలోకి తీసుకొచ్చేలా కాంప్లెక్స్‌ యజమానులకు సూచించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, పోలీసులు ప్రస్తుతం తీసుకున్న చర్యలు నిరంతరం అమలయ్యేలా దృష్టిసారించాలని కోరుతున్నారు. పైరవీలకు, ఇతరత్రా లావాదేవీలకు తలొగ్గకుండా కఠినంగా నగరంలో ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed