తెలంగాణ గవర్నర్‌పై కాంగ్రెస్ నేతలు సీరియస్.. బీఆర్ఎస్‌కు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారా?

by Gantepaka Srikanth |
తెలంగాణ గవర్నర్‌పై కాంగ్రెస్ నేతలు సీరియస్.. బీఆర్ఎస్‌కు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీరుపై కాంగ్రెస్ లీడర్లు కోపంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఫార్ములా ఈ‌‌-రేసులో నిధుల గోల్‌మాల్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడమే అందుకు కారణమని తెలుస్తున్నది. బీఆర్ఎస్ లీడర్లకు మేలు చేసేందుకే గవర్నర్ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వట్లేదని, ఓకే చెప్పి ఉంటే ఇప్పటికే కేటీఆర్ అరెస్ట్ అయ్యేవారని కాంగ్రెస్ లీడర్లు తమ ఇంటర్నల్ మీటింగ్స్‌లో కామెంట్స్ చేస్తున్నట్టు సమాచారం. ఈ-రేసు అంశంపై కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సుమారు నెల రోజుల క్రితం ప్రభుత్వం రాజ్‌భవన్‌కు లేఖ రాసింది. కానీ.. ఇంతవరకు ఆ లేఖపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కాంగ్రెస్ లీడర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు టాక్ ఉంది.

గవర్నర్ సహకరించట్లే..

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ సహకరించడం లేదని ఆ పార్టీ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది. సర్కారు తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం ఏంటి? అనే ప్రశ్నలు వారి నుంచి వస్తున్నాయి. గవర్నర్ పనితీరుతో బీఆర్ఎస్‌కు రాజకీయ ప్రయోజనం కలుగుతున్నదని ఆవేదన చెందుతున్నారు. ఈ నెల రెండో వారంలో గవర్నర్‌‌ ఢిల్లీ వెళ్లారు. సరిగ్గా అదే టైమ్‌లో మాజీ మంత్రి కేటీఆర్ సైతం హస్తినాకు వెళ్లారు. అరెస్ట్ కాకుండా ఉండేందుకే కేటీఆర్ బీజేపీ జాతీయ లీడర్లను కలిసి పైరవీలు చేసుకున్నారని కాంగ్రెస్ లీడర్లు అప్పటినుంచి ఆరోపిస్తున్నారు. అందుకే ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత గవర్నర్ ఫైల్‌పై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. కేటీఆర్ ఢిల్లీ పర్యటన తరువాతే ఫార్ములా ఈ-రేసు కేసులో గవర్నర్ అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ లీడర్లు పదేపదే విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్-బీజేపీ ఒకటేనని ఆరోపిస్తున్నారు. ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత ఒప్పందం ఉందని సెటైర్లు వేస్తున్నారు. గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడం వల్లే ఈ-రేసు కేసులో విచారణ మొదలు కాలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై రాజ్‌భవన్ నుంచి ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.

ప్రొటోకాల్ వివాదాలు లేకుండా జాగ్రత్తలు

బీఆర్ఎస్ హయాంలో నిత్యం రాజ్‌భవన్-ప్రగతిభవన్ మధ్యే వివాదాలు నడిచేవి. గవర్నర్‌కు ప్రొటోకాల్ సమకూర్చేవారు కాదు. దీనిపై అప్పటి గవర్నర్ తమిళి సై బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌కు సైతం గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో వివాదం కోర్టు వరకు వెళ్లింది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యాంగం ప్రకారం గవర్నర్ వ్యవస్థకు ప్రయారిటీ ఇస్తున్నది. గవర్నర్ ఎక్కడికి వెళ్లినా ప్రొటోకాల్ విషయంలో ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ మేరకు అన్నిశాఖల అధికారులకూ ఆదేశాలు ఇచ్చింది. అలాగే.. సీఎం రేవంత్ సైతం గవర్నర్ వద్దకు రెగ్యులర్‌గా వెళ్లి ప్రభుత్వ తీసుకుంటున్న నిర్ణయాలపై వివరిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ లీడర్లు గుర్తు చేస్తున్నారు.

రాజ్‌భవన్ నిర్ణయంపై ఉత్కంఠ

ఫార్ములా ఈ-రేసులో నిధుల గోల్‌మాల్ జరిగిందని మున్సిపల్ శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. విచారణ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే.. రాజ్యాంగంలోని 17a(b) నిబంధనల ప్రకారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణకు అదేశించే అధికారం గవర్నర్‌కు మాత్రమే ఉంది. అందుకోసం ఆ ఫైల్‌ను ప్రభుత్వం రాజ్‌భవన్ అమోదం కోసం పంపింది. కానీ.. నెల రోజులుగా రాజ్‌భవన్‌ నుంచి రిప్లై రాలేదు. దీంతో గవర్నర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఓ దశలో విచారణకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై న్యాయ సలహా కోసం అటార్నీ జనరల్‌ను రాజ్‌భవన్ సంప్రదించినట్టు వార్తలు సైతం వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed