పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్‌కు రజతం.. పాక్ అథ్లెట్‌కు స్వర్ణం

by Harish |   ( Updated:2024-08-08 20:11:07.0  )
పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్‌కు రజతం.. పాక్ అథ్లెట్‌కు స్వర్ణం
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ అథ్లెట్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలిచి సంచలనం సృష్టించిన అతను ఈ సారి కూడా గోల్డ్ మెడల్ సాధిస్తాడని అంతా భావించారు. అయితే, అతను సిల్వర్ మెడల్‌తో సరిపెట్టాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ 89.45 మీటర్ల ప్రదర్శనతో రజతం దక్కించుకున్నాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన అతను.. రెండో ప్రయత్నంలో బల్లాన్ని 89.45 మీటర్లు విసిరి రెండో స్థానానికి దూసుకెళ్లాడు. కెరీర్‌లో నీరజ్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అంతకుముందు పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల ప్రదర్శనతో ఒలింపిక్ వరల్డ్ రికార్డు సృష్టించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. దీంతో ఈ పోటీ అర్షద్, నీరజ్ మధ్య అన్నట్టు సాగింది.

అయితే, నీరజ్ మిగతా ప్రయత్నాల్లో 90 మీటర్ల మార్క్‌ను అందుకుంటాడని ఫ్యాన్స్ ఆశించారు. నీరజ్ కూడా నమ్మకంగా కనిపించాడు. కానీ, అతను మిగతా ప్రయత్నాల్లో ఫౌల్ చేశాడు. మొత్తం ఆరు ప్రయత్నాల్లో ఐదింట అతను ఫౌల్ చేయడం గమనార్హం. అయితే, మిగతా అథ్లెట్లలో ఎవరూ నీరజ్ ప్రదర్శనను అధిగమించలేకపోయారు. దీంతో నీరజ్ రెండో స్థానాన్ని కాపాడుకుని సిల్వర్ మెడల్ సాధించాడు. ఇప్పటివరకు ఈ విశ్వక్రీడల్లో భారత్‌కు ఇదే తొలి రజతం. మరోవైపు, అర్షద్ 92.97 మీటర్ల ప్రదర్శనతో స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. దీంతో పాక్‌కు అథ్లెటిక్స్‌లో తొలి పతకంతోపాటు మొదటి గోల్డ్ మెడల్ అందించిన అథ్లెట్‌గా అర్షద్ రికార్డు నెలకొల్పాడు. గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ 88.5 మీటర్ల త్రో కాంస్యం గెలుచుకున్నాడు. నీరజ్‌కు వరుసగా ఇది రెండో ఒలింపిక్ మెడల్. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. దీంతో నీరజ్ డబుల్ ఒలింపిక్స్ పతకాలు సాధించిన భారత అథ్లెట్ల జాబితాలో చేరాడు. అతని కంటే ముందు సింధు, మను భాకర్, సుశీల్ కుమార్ ఈ ఘనత సాధించారు.

Advertisement

Next Story

Most Viewed