సంచలన నిర్ణయం తీసుకున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్

by Harish |
సంచలన నిర్ణయం తీసుకున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా వికెట్ కీపర్, బ్యాటర్ మాథ్యూ వేడ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రెడ్ బాల్ క్రికెట్‌కు శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘సుదీర్ఘ ఫార్మాట్‌లో సవాళ్లను నేను ఆస్వాదించాను. వైట్ బాల్ క్రికెట్ కొనసాగిస్తాను. అయినప్పటికీ నా దేశం తరపున టెస్టు క్యాప్ ధరించడం నా కెరీర్‌లోనే హైలైట్‌గా మిగిలిపోతుంది. సుదీర్ఘ ఫార్మాట్ ఆడకపోవడం వల్ల నేను మరింత ధృఢంగా మారడానికి, జిమ్‌లో ఎక్కువ కష్టపడటానికి అవకాశం దొరుకుతుంది.’ అని వేడ్ తెలిపాడు. త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌పై దృష్టి పెట్టేందుకు వేడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

టాస్మానియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌ ఫైనల్ వేడ్‌కు చివరి రెడ్ బాల్‌ మ్యాచ్ కానుంది. ఈ మ్యాచ్ ఈ నెల 21 నుంచి ప్రారంభకానుండగా.. వేడ్ టాస్మానియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా, 2012లో భారత్‌పై అంతర్జాతీయ టెస్టు కెరీర్ ప్రారంభించిన వేడ్.. 2021లో టీమ్ ఇండియాపైనే చివరి టెస్టు మ్యాచ్ ఆడటం గమనార్హం. ఆసిస్ తరపున 36 టెస్టులు ఆడిన అతను 1,613 పరుగులు చేశాడు. అలాగే, 165 ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 9,183 రన్స్ చేశాడు. అందులో 19 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఐపీఎల్‌లో వేడ్ గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో అతను ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. తన హోం టీమ్ టాస్మానియా తరపున షెఫీల్డ్ షీల్డ్‌ ఫైనల్ ఆడేందుకు మొగ్గు చూసిన వేడ్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని గుజరాత్ జట్టుకు సమాచారం అందించాడు.

Advertisement

Next Story

Most Viewed