ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు చాంపియన్స్ ట్రోఫీ?

by Harish |
ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు చాంపియన్స్ ట్రోఫీ?
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది జరగబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. చివరిసారిగా 2017 ఈ టోర్నీ జరగగా.. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఐసీసీ ఈ వన్డే ఫార్మాట్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. అయితే, ఈ టోర్నీ షెడ్యూల్‌ ఇంకా ఖరారు కాలేదు. కానీ, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో టోర్నీని నిర్వహించడానికి ఐసీసీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు టోర్నీ జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ తెలిపింది.

ఇటీవల ఐసీసీ దీని గురించి బోర్డు సభ్యులతో చర్చించినట్టు పేర్కొంది. టోర్నీ సమయంలో దేశవాళీ లీగ్‌ల షెడ్యూల్‌ను సర్దుబాటు చేసుకోవడానికి బోర్డు సభ్యులతో ఐసీసీ తాత్కాలిక తేదీలను పంచుకున్నట్టు సదరు మీడియా సంస్థ తెలిపింది. కాగా, వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8 జట్లు చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటాయి. అయితే, ఈ టోర్నీలో భారత్ పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత జట్టు పాక్‌లో పర్యటించడం లేదు. గతేడాది ఆసియా కప్‌కు పాక్ ఆతిథ్యమివ్వగా.. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. శ్రీలంకలో టీమ్ ఇండియా మ్యాచ్‌లు జరిగాయి. అదే తరహాలో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed