Bachelor's Village : వెరైటీ విలేజ్..! ఆ ఊరోల్లకు పిల్లనివ్వాలంటేనే భయపడుతున్న జనం!

by Javid Pasha |
Bachelors Village : వెరైటీ విలేజ్..! ఆ ఊరోల్లకు పిల్లనివ్వాలంటేనే భయపడుతున్న జనం!
X

దిశ, ఫీచర్స్ : మన చుట్టూ సమాజంలో ఎన్నో వింతలు, విశేషాలు, వెరైటీలు మనల్ని ఆకట్టుకుంటుంటాయి. వాటిలో కొన్ని ఆలోచింపజేస్తే, మరికొన్ని సరదా సరదాగా ఉంటాయి. ఇంకొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి కోవకు చెందిన న్యూస్ ఒకటి ప్రస్తుతం నెట్టింటల్ వైరల్ అవుతోంది. ఏంటంటే.. మన దేశంలోని ఓ గ్రామానికి చెందిన యువకులకు అస్సలు పెళ్లిళ్లు కావడం లేదట. ఆ ఊరిపేరు వింటేనే హడలిపోతున్న ఇతర గ్రామాలవారు ఇక్కడి వారితో పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడానికి అస్సలు ముందుకు రావడం లేదు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? ఇక్కడి యువత పెళ్లి కల ఎందుకు నెరవేరడం లేదో ఇప్పుడు చూద్దాం.

అది బిహార్ రాష్ట్రంలోని పాట్నా సిటీకి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్వాన్ కలాన్ విలేజ్ (Barwan Kalan Village). ఎక్కడో మారుమూల ప్రాంతంలో విసిరేసినట్టుగా ఉండే ఈ ఊరిలో ఏ ఇంట చూసినా పెళ్లికాని యువకులే దర్శనమిస్తుంటారు. ఇదేదో ఈ మధ్యనే ఎదురైన సమస్య కాదు. దాదాపు 5 దశాబ్దాలుగా ఇక్కడి యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. దీంతో ఈ గ్రామానికి ‘బ్యాచిలర్స్ విలేజ్’ అనే పేరు కూడా వచ్చిందట. కొందరైతే ‘పెళ్లి కాని ప్రసాదుల గ్రామం’ అని సరదాగా పిలుస్తుంటారు. అయితే ఇక్కడి యువతకు పెళ్లికాకపోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉందంటున్నారు ఆ గ్రామం గురించి తెలిసిన టూరిస్టు నిపుణులు.

బర్వాన్ కలాన్ గ్రామానికి ఇప్పటి వరకు రోడ్డు, కరెంటు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. ముఖ్యంగా ఇక్కడ ఎవరూ సెల్‌ఫోన్ వాడరు. ఎందుకంటే కనుచూపు మేరలో కూడా నెట్వర్క్ ఉండదు. దీంతో ఆ గ్రామంలోని వారికి పిల్లనిస్తే ఎప్పుడైనా వెళ్లి రావడానికి కనీసం రోడ్డు, బస్సు సౌకర్యం కూడా లేదని, చివరికి ఫోన్ మాట్లాడుకునే చాన్స్ కూడా ఉండదని సంబంధాలు కుదుర్చుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక గ్రామంలోని యువత తమ గోడును ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, సమస్య పరిష్కారానికి సానుకూలత వ్యక్తం చేయడం తప్ప ఇప్పటి వరకైతే ఎలాంటి చర్యలు తీసుకోలేదంటున్నారు పలువురు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండగా.. మీ కష్టాలు పగోడికి కూడా రావద్దంటూ స్పందిస్తున్నారు కొందరు నెటిజన్లు.

Advertisement

Next Story