కమిన్స్‌కు తొలి పరీక్ష.. రేపు కోల్‌కతాతో హైదరాబాద్ ఢీ

by Harish |   ( Updated:2024-03-22 14:29:46.0  )
కమిన్స్‌కు తొలి పరీక్ష.. రేపు కోల్‌కతాతో హైదరాబాద్ ఢీ
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి పోరుకు సిద్ధమైంది. కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో రెండో టైటిల్ నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో ఆ జట్టు బరిలోకి దిగుతున్నది. మొదటి మ్యాచ్‌లో శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. కెప్టెన్ కమిన్స్, ట్రావిస్ హెడ్ రాకతో ఈ సారి జట్టు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా గతంతో పోలిస్తే బలంగా మారినట్టు కనిపిస్తున్నది. పేస్ ఆల్‌రౌండర్ కమిన్స్ కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయడంతోపాటు బౌలర్‌గా సత్తాచాటాల్సి ఉంది. వన్డే వరల్డ్ కప్ మెరుపులను ట్రావిస్ హెడ్ కొనసాగిస్తాడో లేదో చూడాలి. హెడ్, మార్‌క్రమ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, క్లాసెన్‌, మయాంక్ అగర్వాల్‌లతో బ్యాటింగ్ దళం పేపర్‌పై బలంగానే కనిపిస్తుంది. అయితే, ప్రతి సీజన్‌లో బ్యాటింగ్ వైఫల్యమే జట్టును దెబ్బ కొడుతుంది. ఈ సారి బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

ప్రతి సీజన్‌లోనూ హైదరాబాద్ ప్రధాన బలం బౌలింగే. ఈ సారి కమిన్స్ రాకతో బౌలింగ్ పరంగా ఆ జట్టు మరింత బలపడిందనే చెప్పొచ్చు. భువనేశ్వర్ కుమార్‌, కమిన్స్ తమ పేస్‌తో ప్రత్యర్థులను ఎలా బెంబేలెత్తిస్తారో చూడాలి. అలాగే, ఉమ్రాన్ మాలిక్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, ఫజల్హక్ ఫరూఖీ, మయాంక్ మార్కండే వంటి నాణ్యమైన బౌలర్లకు జట్టులో కొదవలేదు. అయితే, తుది జట్టు కూర్పు జట్టుకు సమస్యగా మారనుంది. మరోవైపు, కోల్‌కతా జట్టు కూడా బలంగానే ఉన్నది. బ్యాటింగ్ లైనప్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌, గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణాలతోపాటు మేటి ఆల్‌రౌండర్లు రస్సెల్, సునీల్ నరైన్‌ కేకేఆర్ సొంతం. వేలంలో స్టార్క్‌ను తీసుకుని బౌలింగ్ దళాన్ని మెరుగుపర్చుకుంది. వేలంలో స్టార్క్‌ను రికార్డు ధర రూ. 24.75 కోట్లు పెట్టి కేకేఆర్ కొనుగోలు చేయగా.. ఎస్‌ఆర్‌హెచ్ కమిన్స్ కోసం రూ.20.50 కోట్లు వెచ్చించింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఈ ఇద్దరు ప్రత్యేక ఆకర్షణ‌గా నిలువనున్నారు.

Advertisement

Next Story

Most Viewed